తమిళనాడులోని హోసూర్‌ సమీపంలో ఉన్న టాటా ఎలక్ట్రానిక్స్ ఐఫోన్‌ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌లో విషాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీ మెయింటనెన్స్ విభాగంలో పనిచేస్తున్న ముగ్గురు వర్కర్లు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. వ్యర్థజలాల శుద్ధి ప్లాంట్ వద్ద విధులు నిర్వహిస్తుండగా విషపూరిత వాయువులు లీక్ కావడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

సోమవారం రోజున ముగ్గురు ఉద్యోగులు రెగ్యులర్ మెయింటనెన్స్ పనుల్లో భాగంగా వేస్ట్‌వాటర్ ట్రీట్‌మెంట్ ట్యాంక్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తొలుత ఒక కార్మికుడు ట్యాంక్ లోపలికి తొంగిచూస్తూ ఉండగా, లోపలి నుంచి వచ్చిన తీవ్రమైన విషవాయువుల ప్రభావంతో ఒక్కసారిగా అక్కడే కుప్పకూలిపోయాడు. అతనికి ఏమైందోనన్న ఆందోళనతో వెంటనే అక్కడికి చేరుకున్న మరో ఇద్దరు సిబ్బంది కూడా ఆ గ్యాస్ తీవ్రతకు క్షణాల్లోనే స్పృహ కోల్పోయారు.

ఘటనను గమనించిన తోటి ఉద్యోగులు వెంటనే అలర్ట్ అయి, అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గురిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Also Read : ‘దీపావళి పోకర్ నైట్’ గుట్టురట్టు: 20మంది మహిళలు అరెస్ట్!

పోలీసుల దర్యాప్తు.. సంస్థ స్పందనపై నిరీక్షణ

ఈ ఫ్యాక్టరీని టాటా ఎలక్ట్రానిక్స్ నిర్వహిస్తోంది. అయితే ఈ విషాద ఘటనపై ఇప్పటివరకు టాటా సంస్థ నుంచి గానీ, యాపిల్ కంపెనీ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి ఎంక్వైరీ ప్రారంభించారు.

మరోవైపు కంపెనీ కూడా అంతర్గత విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయి పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే కార్మికుల మరణాలకు గల కచ్చితమైన కారణాలు తెలుస్తాయని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఒకేసారి ముగ్గురు తోటి వర్కర్లు చనిపోవడంతో ఫ్యాక్టరీ ప్రాంగణంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

Also Read : ఫోన్‌లో పబ్జీ ఆడే పిల్లలు.. బయట ప్రాణాలు తీస్తారా?