Ukraine : రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపేందుకు భారత్‌ చేస్తున్న ప్రయత్నాలపై ఉక్రెయిన్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. రష్యాతో కాల్పుల విరమణ కోసం తమకు నాలుగు ప్రతిపాదనలు వచ్చాయని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి ఆండ్రియ్‌ సిబిహా తెలిపారు. వాటిలో భారత్‌ ఇచ్చిన ప్రతిపాదనే అత్యంత విస్తృతమైనది అని చెప్పారు.

భారత్‌తో పాటు అమెరికా, టర్కియే, ఈజిప్ట్‌ నుంచి ఈ ప్రతిపాదనలు వచ్చినట్లు సిబిహా చెప్పారు. ఉక్రెయిన్‌ ఇంధన కేంద్రాలపై దాడులు ఆపడంతో పాటు నల్ల సముద్రంలో కూడా కాల్పుల విరమణకు సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే ఈ రెండు అంశాలు కలిసి ఉండాలని స్పష్టం చేశారు. అంటే.. విద్యుత్‌, ఇంధన కేంద్రాలపై దాడులు ఆపాలి. పోర్టులపై కూడా దాడులు చేయకూడదు. అదే సమయంలో నల్ల సముద్రంలో నౌకల రాకపోకలు, ముఖ్యంగా ఆహార ధాన్యాల ఎగుమతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నది ప్రతిపాదనలోని ప్రధాన అంశంగా ఉంది.

టర్కియే, ఈజిప్ట్‌ కూడా నల్ల సముద్రంలో కాల్పులు ఆపేలా ప్రతిపాదనలు చేశాయి. దీని వల్ల ఉక్రెయిన్‌ నుంచి ఇతర దేశాలకు ధాన్యం పంపడం సులభమవుతుందని ఆ దేశాలు భావిస్తున్నాయి. అమెరికా మాత్రం ఇంధన కేంద్రాలపై దాడులు ఆపేలా ప్రతిపాదన చేసినట్లు సిబిహా చెప్పారు. అయితే ఉక్రెయిన్‌ ఇంతటితో ఆగడం లేదు. ముందు వరుసలో రష్యా, ఉక్రెయిన్‌ సైన్యాలు పోరాడుతున్న ప్రాంతంలో కూడా కాల్పులు పూర్తిగా ఆపే ప్రతిపాదనను పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని సిబిహా చెప్పారు.

ఇక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కూడా ప్రధాని నరేంద్ర మోదీపై ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగించేందుకు మోదీ ప్రతి సమావేశంలోనూ మాట్లాడుతారని, సమస్యకు అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ఆయన దగ్గర మంచి ఆలోచనలు ఉన్నాయని పుతిన్‌ చెప్పారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం 2022 ఫిబ్రవరిలో మొదలైంది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య పోరాటం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, ఎంతోమంది తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది. విద్యుత్‌ కేంద్రాలు, ఇళ్లు, ఇతర ముఖ్యమైన ప్రాంతాలు కూడా దెబ్బతిన్నాయి.

ఈ పరిస్థితుల్లో యుద్ధాన్ని ఆపేందుకు భారత్‌తో పాటు పలు దేశాలు శాంతి చర్చలకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు భారత్‌ ప్రతిపాదనపై ఉక్రెయిన్‌ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రయత్నాల్లో మరో కీలక పరిణామంగా మారాయి.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.