
Ashutosh Dixit : భారత వైమానిక దళం (IAF) కొత్త చీఫ్‌గా ఎయిర్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్ నియమితులయ్యారు. ఆయన భారత వైమానిక దళానికి 29వ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. అక్టోబర్ 31న మధ్యాహ్నం ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం ఎయిర్ చీఫ్ మార్షల్‌గా ఉన్న అమర్ ప్రీత్ సింగ్ అదే రోజు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయన స్థానంలో ఆశుతోష్ దీక్షిత్ కొత్త ఎయిర్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఎయిర్ మార్షల్ దీక్షిత్ వైస్ చీఫ్‌గా పనిచేస్తున్నారు.
అమర్ ప్రీత్ సింగ్ నాయకత్వంలో భారత వైమానిక దళం ఆపరేషన్ సిందూర్ 2025 మేలో పాకిస్థాన్‌తో జరిగిన ఘర్షణను ఎదుర్కొంది. ఇప్పుడు దీక్షిత్ ఎయిర్ చీఫ్ మార్షల్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా వైమానిక దళంలో సేవలందిస్తున్న దీక్షిత్ ఫైటర్ పైలట్‌గా విశేష అనుభవం కలిగి ఉన్నారు. దేశీయంగా తయారవుతున్న లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్‌తో పాటు ఇతర భారతీయ విమానాల అభివృద్ధి కార్యక్రమాల్లోనూ ఆయన కీలకంగా పనిచేశారు.
1966 డిసెంబర్ 9న జన్మించిన ఆశుతోష్ దీక్షిత్ 1986 డిసెంబర్ 6న భారత వైమానిక దళంలోని ఫైటర్ స్ట్రీమ్‌లో చేరారు. ఇప్పటివరకు 3,500 గంటలకు పైగా విమానాలను నడిపిన అనుభవం ఆయనకు ఉంది. మిరాజ్-2000, వివిధ మిగ్ విమానాలు, కిరణ్, జాగ్వార్, IL-78, హాక్, తేజస్ వంటి పలు రకాల విమానాలను ఆయన నడిపారు. ఆపరేషన్ సఫేద్ సాగర్, ఆపరేషన్ రక్షక్, ఆపరేషన్ సిందూర్ వంటి కీలక ఆపరేషన్లలోనూ ఆయనకు అనుభవం ఉంది.
దీక్షిత్ గతంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్‌గా కూడా పనిచేశారు. ఈ పదవిలో వైమానిక దళానికి సంబంధించిన ప్లానింగ్, పాలసీ, ఆపరేషనల్ సామర్థ్యాలపై ఆయన కీలకంగా పనిచేశారు. ఎయిర్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ రిక్వైర్మెంట్స్, అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్, అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ వంటి బాధ్యతలు నిర్వహించారు. అంతకుముందు సదరన్ ఎయిర్ కమాండ్‌లో ఎయిర్ డిఫెన్స్ కమాండర్‌గా, సౌత్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌లో సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా 2006లో వాయుసేన మెడల్, 2011లో విశిష్ట సేవా మెడల్, 2023లో అతి విశిష్ట సేవా మెడల్, 2026లో పరమ విశిష్ట సేవా మెడల్ అందుకున్నారు.









