Ayodhya Temple : రామమందిర విరాళాల సేకరణలో అవినీతి జరిగిందనే ఆరోపణలు అయోధ్య నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు సంబంధించి వచ్చిన ఈ విరాళాల కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో, ఆధ్యాత్మిక నగరిగా పేరుగాంచిన అయోధ్యలో భక్తుల సందడి గణనీయంగా తగ్గింది. దీనివల్ల స్థానిక వ్యాపారుల జీవనోపాధి దెబ్బతింటోందని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో రోజుకు లక్ష నుండి లక్షన్నర మంది భక్తులు వచ్చేవారని, అయితే వివాదాల తర్వాత ఆ సంఖ్య 60 వేల నుండి 70 వేలకు పడిపోయిందని స్థానికులు చెబుతున్నారు. రాంపథ్ మార్గంలో పూలు, గంధం, ప్రసాదాలు విక్రయించే వారి ఆదాయం భారీగా పడిపోయింది. గతంలో రోజుకు రూ. 4,000 నుండి రూ. 5,000 వరకు సంపాదించే వ్యాపారులు, ఇప్పుడు రూ. 1,000 కూడా సంపాదించలేక ఇబ్బందులు పడుతున్నారు. హోటల్ గదుల ఆక్యుపెన్సీ 25 శాతానికి పడిపోయిందని అయోధ్య హోటల్ అసోసియేషన్ ప్రతినిధి అరుణ్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం వస్తున్న భక్తులు కూడా స్థానిక ప్రాంతాలకు చెందిన వారే కావడంతో వ్యాపారాలకు పెద్దగా లాభం చేకూరడం లేదు.

ఈ వివాదంపై అయోధ్యలోని సాధువులు, మహంతులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది పరిపాలనా వైఫల్యమని, భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నమని కొందరు అభిప్రాయపడుతుంటే, చిన్నస్థాయి ఉద్యోగుల తప్పిదమని, ట్రస్ట్‌కు ఇందులో సంబంధం లేదని మరికొందరు వాదిస్తున్నారు. ఈ ట్రస్ట్‌ను రద్దు చేసి, అయోధ్య సాధువులతో కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని, మరికొందరు శంకరాచార్యులకు ఇందులో ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో మరో తొమ్మిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ వివాదం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. రామమందిర నిర్మాణం బీజేపీకి కీలకమైన అజెండా కావడంతో, ఈ ఆరోపణలు విపక్షాలకు మంచి ఆయుధంగా మారాయి. నష్ట నివారణ చర్యల్లో భాగంగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు రంగంలోకి దిగి, దోషులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, విచారణ జరుగుతోందని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్ దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వగా, ఈ వ్యవహారంపై పార్లమెంటులో నిలదీస్తామని సమాజ్‌వాదీ పార్టీ హెచ్చరించింది. వివాదం సద్దుమణగకముందే ఎన్నికలు జరిగితే రాజకీయ నష్టం వాటిల్లుతుందనే భయంతో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.