ayodhya

Ayodhya Ram Temple Funds : అయోధ్య రామాలయానికి భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగం వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో అరెస్టైన ఎనిమిది మంది నిందితులకు ప్రత్యేక అవినీతి నిరోధక న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నందున, నిందితులను కస్టడీలో ఉంచాలన్న పోలీసుల అభ్యర్థనను కోర్టు మన్నించింది. దీంతో నిందితులంతా జులై 13 వరకు జైలులోనే గడపనున్నారు.

ఈ కేసులో రామశంకర్ అలియాస్ తిన్నూ యాదవ్‌తో పాటు అవినాశ్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్‌కుశ్ మిశ్రా, మనీశ్ కుమార్ యాదవ్, కరుణేశ్ పాండే, రామ్‌శంకర్ మిశ్రా, సుభాశ్ శ్రీవాస్తవ్‌లను నిందితులుగా గుర్తించారు. వీరంతా రామాలయానికి వచ్చే నగదు, విలువైన వస్తువుల లెక్కింపు,వాటి నిర్వహణ బాధ్యతల్లో కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తు సంస్థలు ప్రాథమికంగా నిర్ధారించాయి. భక్తుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ వీరు ఈ అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Also Read : కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో కొత్తకోణం.. విచారణలో కీలక విషయాల వెల్లడి

కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఎస్‌ఐటీ) ఇప్పటికే నిందితుల ఇళ్లపై ముమ్మరంగా సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో సుమారు రూ. 79.85 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తమ సంపాదనకు మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వస్తుండటంతో, వారి బ్యాంక్ ఖాతాలు, స్థిరాస్తులు,ఇటీవలి ఆర్థిక లావాదేవీలపై అధికారులు లోతైన విచారణ జరుపుతున్నారు. ఈ కుంభకోణంలో కొందరు బ్యాంక్ ఉద్యోగుల హస్తం కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

మరోవైపు, ఈ విరాళాల దుర్వినియోగం వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసి, కోర్టు పర్యవేక్షణలోనే నిర్ణీత కాలవ్యవధిలో నిష్పాక్షిక విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు. అయితే, ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. వేసవి సెలవుల అనంతరం దీనిని విచారణకు స్వీకరిస్తామని స్పష్టం చేస్తూ, “ఈలోపే మిన్ను విరిగి మీద పడదు కదా.. అంత తొందరెందుకు?” అని పిటిషనర్‌ను ప్రశ్నించింది.

ఈ కుంభకోణం కాస్తా ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. రాష్ట్రంలోని విపక్షాలైన సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడిని పెంచాయి. పవిత్రమైన రామాలయ విరాళాల్లోనే అవినీతి జరగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపడుతున్నాయి. దీనికి ప్రతిగా స్పందించిన అధికార యోగి ప్రభుత్వం, దోషులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేస్తూనే.. విపక్షాలు రాజకీయ లబ్ధి కోసమే అనవసర రచ్చ చేస్తున్నాయని ఆరోపించింది.

ఈ నేపథ్యంలో అయోధ్య బార్ అసోసియేషన్ ఒక సంచలన, చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కోట్ల మంది హిందువుల ఆరాధ్యదైవమైన రామాలయ విరాళాల దుర్వినియోగం తమ మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని బార్ అసోసియేషన్ పేర్కొంది. అందువల్ల ఈ కేసులో అరెస్టైన ఎనిమిది మంది నిందితుల తరఫున తమ సంఘానికి చెందిన ఏ న్యాయవాదీ కోర్టులో వకాలత్ పుచ్చుకోకూడదని, వారి తరఫున వాదించరాదని బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు.

ఒకవేళ బార్ అసోసియేషన్ తీసుకున్న ఈ సామూహిక నిర్ణయాన్ని ఉల్లంఘించి, నిందితుల తరఫున ఏ న్యాయవాది అయినా కోర్టులో వాదిస్తే వారికి రూ. 5 లక్షల భారీ జరిమానా విధిస్తామని అసోసియేషన్ అధ్యక్షుడు కాళికా శరణ్ మిశ్రా హెచ్చరించారు. నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరిచిన రోజే అత్యవసరంగా సమావేశమైన లాయర్ల సంఘం ఈ కఠిన నిర్ణయాన్ని ప్రకటించింది. గతంలో 2005 నాటి రామజన్మభూమి తాత్కాలిక ఆలయంపై జరిగిన ఉగ్రదాడి కేసులోనూ ఈ అసోసియేషన్ నిందితుల తరఫున వాదించబోమని ఇలాగే ప్రకటించడం గమనార్హం.

అంతేకాకుండా, బార్ అసోసియేషన్ ఈ సమావేశంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రా, ఆలయ నిర్మాణ ఇన్‌ఛార్జి గోపాల్‌రావులపై కూడా తక్షణమే కేసులు నమోదు చేయాలని తీర్మానించింది. వీరంతా మరో మూడు రోజుల్లోగా అయోధ్య నగరాన్ని విడిచి వెళ్లాలని, లేనిపక్షంలో నగరవ్యాప్తంగా బంద్ ప్రకటించి, రామాలయాన్ని దిగ్బంధిస్తామని లాయర్ల సంఘం హెచ్చరించడంతో అయోధ్యలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Also Read : ఊరమాస్ సేల్ మావా: రూ.22వేల భారీ డిస్కౌంట్.. Iphone 17 సిరీస్‌ ఆఫర్ ధరలివే..!

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.