
Smoking In Trains : రైలు ప్రయాణమంటే చాలు చాలామంది అపరిశుభ్రత, తోటి ప్రయాణికుల అసౌకర్యం, అనధికారిక వ్యక్తుల బెర్తుల ఆక్రమణల వంటి సమస్యలతో వెనుకంజ వేస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం ‘అమృత్ భారత్’ పథకం కింద స్టేషన్లను ఆధునీకరిస్తూ, వందేభారత్ వంటి అధునాతన రైళ్లను ప్రవేశపెడుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో నిబంధనల ఉల్లంఘనలు రైల్వే ప్రతిష్టను, ఆదాయాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే, ప్రయాణికుల్లో క్రమశిక్షణ పెంచేందుకు, ప్రయాణాన్ని సాఫీగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టాలను కఠినతరం చేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది.
రైల్వేల్లో అరాచకాలకు, నిబంధనల ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) చట్టం 2026’ను తీసుకువచ్చింది. దీనికోసం పాత రైల్వే చట్టం 1989లో కీలక మార్పులు చేస్తూ భారీగా పెనాల్టీలు, జైలు శిక్షలను సవరించింది. ఈ మేరకు జూన్ 19న అధికారిక గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ అయింది. ఈ సరికొత్త నిబంధనలు జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అత్యంత పకడ్బందీగా అమలుల్లోకి రానున్నాయి.
Also Read : మీరు నిజంగా భారతీయులని ఏది నిరూపిస్తుంది?
రూ.100 నుంచి రూ.2,000లకు పెరిగిన పెనాల్టీ:
ఇకపై రైళ్లలో, ప్లాట్‌ఫారాలపై ధూమపానం (సిగరెట్, బీడీ) చేసేవారికి గండం పొంచి ఉందనే చెప్పాలి. రైళ్ల ద్వారాల వద్ద నిలబడి లేదా వాష్‌రూమ్‌లలో దొంగచాటుగా దమ్ము కొట్టేవారికి ఇకపై భారీ మూల్యం తప్పదు. ఇప్పటివరకు ఇలాంటి ఉల్లంఘనలకు కేవలం రూ. 100 జరిమానా విధించి వదిలేసేవారు. కానీ, కొత్త నిబంధనల ప్రకారం ఈ జరిమానాను ఏకంగా రూ. 2,000లకు పెంచారు. జరిమానాతో పాటు తక్షణమే టికెట్‌ను రద్దు చేసి, తదుపరి స్టేషన్లోనే ప్రయాణికుడిని కిందకు దించేసే కఠిన అధికారాలను రైల్వే సిబ్బందికి ఇచ్చారు. ఒకవేళ స్పాట్లో జరిమానా కట్టకపోతే, రైల్వే కోర్టులో హాజరుపరిచి జైలు శిక్ష కూడా విధిస్తారు.
బెర్తుల ఆక్రమణలు, యాచకులకు కళ్లెం:
సాధారణ టికెట్లు ఉండి లేదా అసలు టికెట్లే లేకుండా రిజర్వ్డ్ కోచ్‌లలోకి చొరబడి బెర్తులను ఆక్రమించే వారిపై, తోటి ప్రయాణికులను బెదిరించే వారిపై ఇకపై కఠిన చర్యలు ఉంటాయి. రైళ్లలో దాదాపు 25 శాతం మంది టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లు అంచనాలు ఉన్నాయి. దీనివల్ల రైల్వేకు భారీగా ఆదాయ గండి పడుతోంది. తాజా చట్టం ప్రకారం.. స్పాట్లోనే భారీ జరిమానాలు వసూలు చేసే అధికారం అధికారులకు ఇవ్వడం ద్వారా టికెట్ లేని ప్రయాణాలకు, స్టేషన్లను స్థావరాలుగా మార్చుకునే యాచకులకు,అనధికారిక విక్రయదారులకు పూర్తిస్థాయిలో కళ్లెం పడనుంది.ఈ కఠిన నిబంధనల అమలు వల్ల తోటి ప్రయాణికులకు ఎదురయ్యే మానసిక, శారీరక అసౌకర్యాలు చాలా వరకు తగ్గుతాయి. ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించే మహిళా ప్రయాణికులకు, కుటుంబాలతో ప్రయాణించే వారికి రైల్వేలో గట్టి భరోసా లభిస్తుంది. భారీ జరిమానాలు, తక్షణ జైలు శిక్షల భయంతో ప్రయాణికుల మధ్య అనవసర వివాదాలు, ఘర్షణలు తగ్గుముఖం పడతాయని ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తోంది.
Also Read : కేంద్ర కేబినెట్ ప్రక్షాళన .. 38 మంది మంత్రులు ఔట్ : బండి సంజయ్ పరిస్థితేంటి?
మెరుగైన ఆరోగ్యం.. పరిశుభ్రమైన ప్రాంగణాలు:
రైల్వే ప్రాంగణాల్లో కేవలం గుర్తింపు పొందిన, అధీకృత విక్రయదారులు మాత్రమే తినుబండారాలు అమ్మేలా నియంత్రించడం వల్ల ప్రయాణికుల ఆరోగ్యానికి పూర్తి రక్షణ లభిస్తుంది. అంతేకాకుండా, ప్రజల్లో క్రమశిక్షణ పెరిగి రైళ్లు, రైల్వే స్టేషన్లు అపరిశుభ్రం కాకుండా శుభ్రంగా మారే అవకాశం ఉంది. ఈ సంస్కరణల ద్వారా రైల్వేకు నష్టాలు పూడి ఆదాయం పెరగడమే కాకుండా, సామాన్య ప్రజల్లో రైలు ప్రయాణంపై ఉన్న సదభిప్రాయం మరింత రెట్టింపు కానుంది.









