సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఓపెన్ ఛాలెంజ్ విసురుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబైలో సీజేపీ చేపట్టిన భారీ ధర్నా కార్యక్రమంలో మాట్లాడిన అభిజీత్.. నెక్స్ట్ తమ టార్గెట్ అమిత్ షానే అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిరసన తెలుపుతున్న యువకులపై కనుక ప్రభుత్వం మళ్లీ లాఠీఛార్జ్‌కు ఆదేశిస్తే, దానికి పరిణామంగా హోంమంత్రి పదవికి అమిత్ షా రాజీనామా చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని అభిజీత్ దీప్కే డిమాండ్ చేశారు. నిరసన వేదికపై నుంచి “GYANESH BRO, JUST RESIGN” అంటూ యువత హోరెత్తించిన నినాదాలు ముంబై వీధుల్లో మార్మోగాయి. జ్ఞానేశ్ కుమార్‌ను కేవలం పదవి నుంచి తొలగించడమే కాకుండా ఆయనపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని సీజేపీ పట్టుబడుతోంది. 2025 ఓటర్ లిస్ట్‌ను తక్షణమే ఫ్రీజ్ చేసి ఆ తర్వాతే పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని, అలాగే ఎలక్షన్ కమిషనర్ల నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read : జేబులో రూపాయి లేకుండానే బిజినెస్.. గవర్నమెంట్ పోర్టల్‌తో క్షణాల్లో లోన్.. ఎలాగంటే?

ముంబైలో జరిగిన ఈ భారీ ధర్నా కేవలం ఒక ట్రైలర్ మాత్రమేనని అభిజీత్ స్పష్టం చేశారు. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదని.. త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరిస్తామని ప్రకటించారు. గోవా, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో నిరసనలు చేపట్టిన తర్వాత నేరుగా దేశ రాజధాని ఢిల్లీకి తమ ఉద్యమాన్ని తరలిస్తామని చెప్పారు. అక్టోబర్ 10వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనకు పిలుపునిచ్చిన అభిజీత్.. అసలైన పోరాటం ఢిల్లీలోనే ఉంటుందని మాస్ వార్నింగ్ ఇచ్చారు.

ప్రభుత్వ అణచివేత చర్యలకు తాము భయపడేది లేదని అభిజీత్ దీప్కే తెగేసి చెప్పారు. “నన్ను జైల్లో పెట్టినా సరే.. బయటకు వచ్చి మళ్లీ పోరాడతా” అని ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక జారీ చేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసేంతవరకు తమ పోరాటం ఆపేది లేదని, ఎంతవరకైనా వెళ్తామని ప్రకటించారు. ఈ ఉద్యమానికి ప్రముఖ బాలీవుడ్ నటులు నసీరుద్దీన్ షా, షబానా ఆజ్మీ, సంగీత దర్శకుడు విశాల్ దద్లానీలతో పాటు పలువురు ప్రముఖులు బహిరంగంగా మద్దతు పలకడం ఉద్యమానికి మరింత బలాన్నిచ్చింది.

మొత్తానికి సీఈసీ రాజీనామా డిమాండ్‌తో మొదలైన ఈ ఉద్యమం ఇప్పుడు ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకే సవాల్ విసిరే స్థాయికి చేరింది. ముంబై ధర్నాతో షాక్ ఇచ్చిన సిజేపీ అక్టోబర్ 10న జంతర్ మంతర్ దగ్గర చేపట్టబోయే నిరసనతో ఢిల్లీని షేక్ చేయడానికి సిద్ధమవుతోంది.

Also Read : హనుమాన్ చాలీసా చదువుతూనే అందర్ని కాపాడాను.. మోదీతో స్మిత్ మచ్ఛర్‌ వీడియో కాల్!