కేంద్ర ఎన్నికల సంఘం వైఖరికి నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఢిల్లీలో మహా ధర్నా చేపట్టింది. ఈ క్రమంలో సీజేపీ అధినేత అభిజీత్ దీప్కే బెంగళూరు నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమానికి వేలాది మంది కార్యకర్తలు, మద్దతుదారులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Also Read : ఫోన్ సిగ్నల్స్ లేకపోయినా నో ప్రాబ్లమ్.. మస్క్ స్టార్‌లింక్‌తో నెట్‌వర్క్.. ఎలాగంటే?

శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయనే కారణంతో ఈ నిరసన కార్యక్రమానికి ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆందోళనకారులు ఢిల్లీకి చేరకుండా అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా వందలాది రైళ్లను రద్దు చేశారు. అటు ఢిల్లీ నగరంలో దాదాపు 45 మెట్రో స్టేషన్లను ముందస్తుగా మూసివేశారు. అంతేకాకుండా ఆందోళనకారులు ఒకచోట సమాచారం వేగంగా చేరవేయకుండా ఉండేందుకు జంతర్ మంతర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా బంద్ చేశారు.

పరిస్థితి చేయిదాటిపోకుండా ఢిల్లీ యంత్రాంగం మునుపెన్నడూ లేనంత కఠినమైన ఆంక్షలు విధించింది. జంతర్ మంతర్, లోక్‌సభ, ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో సుమారు 25 వేల మంది పోలీసులు, పారామిలిటరీ బలగాలను మోహరించారు. గగనతలం నుంచి నిరంతరం డ్రోన్లు, సీసీటీవీ కెమెరాల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రైళ్లు, మెట్రోలు బంద్ కావడంతో సాధారణ ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పోలీసులు ఇన్ని ఆంక్షలు విధించినా, నెట్ బంద్ చేసినా, చివరికి రవాణా వ్యవస్థను నిలిపివేసినా సరే తమ పోరాటం ఆగేది లేదని సీజేపీ అధినేత అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. రాజ్యాంగం తమకు ఇచ్చిన హక్కుల ప్రకారం జంతర్ మంతర్ వద్ద ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేసి తీరుతామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పారు. దీంతో ఢిల్లీలో ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొంది.

Also Read : ఢిల్లీలో హైటెన్షన్.. ప్రముఖ యూట్యూబర్‌తో పాటు అభిజీత్ దీప్కే అరెస్టు?