
Abhijeet Dipke : కాక్‌రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే ఇంట విషాదం చోటుచేసుకుంది. శనివారం జంతర్ మంతర్‌లో నిరసనలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన దీప్కే నానమ్మ అనారోగ్యంతో అదే రోజు ఉదయం మహారాష్ట్రలోని స్వగ్రామంలో చనిపోయారు. విమానం ఢిల్లీలో దిగిన వెంటనే దీప్కేతో పాటు ఆయన సహచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అక్టోబర్ 10న జంతర్ మంతర్‌లో ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ CJP ఆందోళన చేపట్టింది. ఈ నిరసనలో పాల్గొనేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి యువత ఢిల్లీకి చేరుకున్నారు. ఈ ఆందోళనకు నాయకత్వం వహించేందుకు వచ్చిన దీప్కే, ఆయన సహచరులను ఢిల్లీ విమానాశ్రయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో ఆయన నానమ్మ చనిపోయిన వార్త కుటుంబ సభ్యుల నుంచి అందింది.
Also Read : నెట్‌ఫ్లిక్స్‌లో భారీగా ఉద్యోగాల కోత.. 850 మంది ఔట్!
అభిజీత్ దీప్కే స్వగ్రామం మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో ఉన్న సంతుక్ పింప్రి. ఆయన నానమ్మ అక్కడే ఉంటున్నారు. దీప్కే తండ్రి ఉద్యోగం కారణంగా కుటుంబం ఛత్రపతి శంభాజీనగర్‌కు వెళ్లి స్థిరపడింది. అయితే, నానమ్మ మాత్రం పూర్వీకుల గ్రామంలోనే ఉండిపోయారు. గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
మరోవైపు ఢిల్లీలో CJP ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతలను అజింక్య షిండేకు అప్పగిస్తున్నట్లుగా అభిజీత్ దీప్కే వెల్లడించారు. CJP ముఖ్య నాయకులు పోలీసుల అదుపులో ఉండటంతో, వారు విడుదలయ్యే వరకు అజింక్య షిండే నిరసనలకు నాయకత్వం వహిస్తారని తెలిపారు. ముందుగా రికార్డ్ చేసిన ఓ వీడియోను CJP తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. విమానంలోనే తనను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని ఊహించిన దీప్కే, ముందుగానే ఈ వీడియోను సిద్ధం చేసుకున్నారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు దీప్కేతో పాటు CJP సభ్యులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా ముంబై నుంచి ఢిల్లీకి విమానంలో వచ్చారు. విమానం ఢిల్లీలో దిగిన వెంటనే పోలీసులు అందులోకి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన అజింక్య షిండే చాలా ఏళ్లుగా అభిజీత్ దీప్కేకు సన్నిహితంగా ఉంటున్నారు. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ మహారాష్ట్ర బృందంలో సోషల్ మీడియా సమన్వయకర్తగా పనిచేశారు. 2016లో గోవాలో దీప్కేను తొలిసారి కలిసినట్లు సమాచారం. ఆ తర్వాత తన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి పూర్తిస్థాయిలో ఆమ్ ఆద్మీ పార్టీ కోసం పనిచేయడం మొదలుపెట్టారు.
Also Read : CJP నిరసన అట్టర్ ఫ్లాప్.. ప్రజాస్వామ్యమే గెలిచింది: బీజేపీ సంచలన ప్రకటన!









