
CM vijay : తమిళనాడు ప్రభుత్వం మరో కీలక సంక్షేమ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టే చిన్నారులకు ఒక గ్రాము బంగారు ఉంగరం అందించే థైమామన్ గోల్డ్ రింగ్ స్కీమ్ ను సెప్టెంబర్ 28న ప్రారంభించనుంది. సీఎంం విజయ్ ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు విజయ్ ప్రకటించిన మేనిఫెస్టోలో ఈ పథకం కూడా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టే అర్హత ఉన్న ప్రతి బిడ్డకు ఒక గ్రాము బంగారు ఉంగరం ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడంతో పాటు.. పుట్టిన బిడ్డను, తల్లిని గౌరవించే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు.
ఈ పథకం కింద 2026 జూన్ 22 నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టిన అర్హత ఉన్న చిన్నారులకు కూడా ప్రయోజనం వర్తించనుంది. అంటే పథకం ప్రారంభం సెప్టెంబర్ 28న జరిగినా.. జూన్ 22 నుంచి పుట్టిన పిల్లలను కూడా ఇందులోకి తీసుకోనున్నారు.
ఈ పథకం కోసం తమిళనాడు ప్రభుత్వం ఏడాదికి రూ.755.83 కోట్లను కేటాయించింది. మొత్తం ఏడాదికి 4,41,667 ఒక గ్రాము బంగారు ఉంగరాలు అవసరమవుతాయని అంచనా వేసింది. ఇప్పటికే తొలి దశలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పుట్టిన చిన్నారుల కోసం 1,28,499 ఉంగరాల సరఫరాకు ఆర్డర్లు కూడా ఇచ్చింది.
మొదట ఈ పథకాన్ని సెప్టెంబర్ 15న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మాజీ ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురై జయంతి సందర్భంగా ఆ రోజు కార్యక్రమం నిర్వహించాలనుకుంది. అయితే ముఖ్యమంత్రి విజయ్ అధికారిక UK పర్యటన కారణంగా ప్రారంభోత్సవం వాయిదా పడింది. తాజాగా సెప్టెంబర్ 28న పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
తమిళనాడులోని సంప్రదాయమైన థైమామన్ సీర్ లో భాగంగా మేనమామ పుట్టిన బిడ్డకు బహుమతులు ఇవ్వడం ఆనవాయితీ. అదే సంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ పథకానికి థైమామన్ గోల్డ్ రింగ్ స్కీమ్ గా పేరు పెట్టింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను పెంచడం, తల్లీబిడ్డల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడం కూడా ఈ పథకం లక్ష్యాల్లో భాగంగా ప్రభుత్వం చెబుతోంది.









