ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో అల్లర్లకు పాల్పడిన దాదాపు 2,500 మందిని పోలీసులు కేవలం మూడు రోజుల్లోనే పట్టుకున్నారు. అయితే వేలాది మంది ఉన్న గుంపులో అంతమంది నేరస్థులను పోలీసులు ఎలా గుర్తుపట్టారు. అసలు వారి క్రైమ్ హిస్టరీని బయటకు ఎలా తీశారని చాలా మందిలో డౌట్ మొదలైంది. అయితే పోలీసులు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్(FRS ), కృత్రిమ మేధస్సు (AI), అల్గోరిథంల సహాయంతో నిందితులను తక్కువ సమయంలోనే గుర్తుపట్టుకున్నారు.

Also Read : నేడు ఈ ఐదు రాశుల వారు జాగ్రత్త.. లేకపోతే తప్పని తిప్పలు

FRS అంటే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్. సాధారణంగా మనం ఫోన్‌లలో ఉపయోగించే ‘ఫేస్ లాక్’ టెక్నాలజీకి ఇది అప్‌డేట్ వెర్షన్. ప్రతీ మనిషి వేలిముద్రలు ఎలాగైతే ఒకరితో ఒకరికి కలవవో.. అలాగే ప్రతీ వ్యక్తి ముఖం అస్థిపంజర నిర్మాణం, కొలతలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ FRS టెక్నాలజీ ముఖంపై ఉండే పాయింట్లను గుర్తించి ఒకే రహస్య డిజిటల్ డేటాను తయారు చేస్తుంది. దీనివల్ల వ్యక్తి గడ్డం పెంచినా, మాస్క్ ధరించినా లేదా కళ్లజోడు పెట్టుకున్నా సరే.. వారి ఒరిజినల్ ఫేస్‌ను సిస్టమ్ ఈజీగా గుర్తుపట్టగలదు.

ఈ టెక్నాలజీ మొత్తం నాలుగు దశల్లో ఫేస్‌ను రికగ్నైజ్ చేస్తుంది. మొదటి దశలో రద్దీగా ఉండే ప్రాంతాలు, నిరసన వేదికల వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరాలు, డ్రోన్‌లు లేదా ప్రత్యేక FRS వ్యాన్‌లు కదులుతున్న మనుషుల స్పష్టమైన ఫోటోలను తీస్తాయి. రెండో దశలో కెమెరా ఆ ముఖాన్ని 3D మ్యాపింగ్ చేస్తుంది. అంటే రెండు కళ్ల మధ్య ఉండే దూరం, ముక్కు పొడవు, వెడల్పు, గడ్డం ఆకారం, నుదుటి వైశాల్యం, చెంప ఎముకల మధ్య ఉండే అంతరం వంటి డజన్ల కొద్దీ కీలక పాయింట్లను గమనిస్తుంది.

Also Read : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తిరస్కరణ: NTAలో భారీ ప్రక్షాళనకు కేంద్రం శ్రీకారం?

మూడో దశలో కంప్యూటర్ ఈ కొలతలన్నింటినీ కలిపి ఒక ప్రత్యేకమైన గణిత కోడ్‌గా మారుస్తుంది. దీన్నే టెక్నాలజీ భాషలో ‘ఫేస్ ప్రింట్’ లేదా ‘ఫేషియల్ మ్యాప్’ అని పిలుస్తారు. ఇక నాలుగో దశలో కంప్యూటర్ తయారుచేసిన ఈ కొత్త ఫేస్ ప్రింట్‌ను పోలీసుల దగ్గర ఉన్న నేరస్థుల డిజిటల్ డేటాబేస్‌తో పోల్చి చూస్తుంది. అందులో పాత నేరస్థులు, కోర్టు వారెంట్ ఉన్నవారు లేదా ఎఫ్‌ఐఆర్‌లలో ఉన్న నిందితుల ఫోటోలు ఉంటాయి. ఒకవేళ ఆ ముఖం మ్యాచ్ అయితే.. వెంటనే కంట్రోల్ రూమ్‌లో ఉన్న అధికారులకు అలర్ట్ మెసేజ్ వెళ్తుంది.

భద్రతా దళాలకు, దర్యాప్తు సంస్థలకు ఈ ఎఫ్‌ఆర్‌ఎస్ వ్యవస్థ ఒక శక్తివంతమైన ఆయుధంగా ఉపయోగపడుతోంది. ఎంత పెద్ద గందరగోళ సమూహం అయినా సరే.. ఈజీగా నేరస్థులను సెకన్లలో గుర్తించవచ్చు. అంతేకాకుండా జాతరలు, పెద్ద పెద్ద ఈవెంట్లలో తప్పిపోయిన చిన్న పిల్లలను, వృద్ధులను వెతికి పట్టుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నేరం జరిగిన ప్రదేశంలో నిందితుడు ఉన్నాడని అనడానికి కోర్టుల్లో సాక్ష్యంగా పనిచేస్తుంది.