DK Shiva Kumar : కర్ణాటక సీఎం డీకే శివకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. తనతో పాటు కేరళ సీఎం వీడీ సతీశన్‌ను కూడా మెటా స్మార్ట్ గ్లాసెస్‌తో రహస్యంగా రికార్డ్ చేసేందుకు ప్రయత్నం జరిగిందని ఆయన అన్నారు. ఈ ఆరోపణలు కర్ణాటకలో ఇప్పటికే కొనసాగుతున్న రహస్య వీడియోల వివాదాన్ని మరింత పెంచాయి. ఓ ఇంటర్వ్యూలో శివకుమార్ ఈ విషయాన్ని చెప్పారు. ఓ పారిశ్రామికవేత్త తనను కలిసిన సమయంలో అతడి ప్రవర్తన అనుమానం కలిగించిందని ఆయన తెలిపారు. ఆ పారిశ్రామికవేత్త ప్రభుత్వ అధికారుల ద్వారా తనతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాడని శివకుమార్ చెప్పారు. మొదట వ్యాపారానికి సంబంధించిన విషయాలపై మాట్లాడిన అతడు.. ఆ తర్వాత రాజకీయాల గురించి మాట్లాడటం మొదలుపెట్టాడని అన్నారు.

బూత్ స్థాయి రాజకీయ వ్యూహాలు, రాజకీయ పరిణామాల గురించి అతడు ఎక్కువగా ఆసక్తి చూపడంతో తనకు అనుమానం వచ్చిందని శివకుమార్ తెలిపారు. అంతేకాదు, ఆ సమయంలో అతడు మెటా స్మార్ట్ గ్లాసెస్ పెట్టుకోవడం కూడా తన అనుమానాలను పెంచిందని చెప్పారు. దీంతో ఆ పారిశ్రామికవేత్త గురించి తెలుసుకోవాలని అధికారులను శివకుమార్ ఆదేశించారు. ఆ పారిశ్రామికవేత్త నేపథ్యం గురించి చిన్న విచారణ చేయాలని నా అధికారులను అడిగాను అని ఆయన చెప్పారు. ఆ విచారణలో తన అనుమానాలను మరింత పెంచే విషయాలు బయటపడ్డాయని శివకుమార్ పేర్కొన్నారు. కేరళ సీఎం వీడీ సతీశన్‌ను కలిసినప్పుడు కూడా ఆ వ్యక్తి అదే మెటా గ్లాసెస్ పెట్టుకున్నాడని ఆయన ఆరోపించారు.

అయితే ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఒక కేంద్ర మంత్రిని కలిసినప్పుడు మాత్రం ఆ గ్లాసెస్ పెట్టుకోలేదని శివకుమార్ చెప్పారు. వీడీ సతీశన్‌ను, నన్ను కలిసినప్పుడు మాత్రమే అతడు మెటా గ్లాసెస్ పెట్టుకున్నాడు అని శివకుమార్ ఆరోపించారు. అయితే ఆ గ్లాసెస్‌తో నిజంగా ఏదైనా రికార్డింగ్ జరిగిందా లేదా అనే విషయాన్ని శివకుమార్ వెల్లడించలేదు. ఆ పారిశ్రామికవేత్త ఎవరు అనే విషయాన్ని కూడా ఆయన బయటపెట్టలేదు. తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను కూడా ఇప్పటివరకు ప్రజల ముందు ఉంచలేదు.

Also Read : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. ఆయుధాల ఎగుమతిలో టాప్-2కి చేరిన భారత్

చర్యలు తీసుకున్నాం: డీకే శివకుమార్

ఈ ఘటనపై చర్యలు ఎందుకు తీసుకోలేదని అడిగినప్పుడు.. చర్యలు తీసుకున్నామని శివకుమార్ చెప్పారు. అయితే వాటి వివరాలను బయటకు చెప్పడం లేదని తెలిపారు. చర్యలు తీసుకోలేదని ఎవరు చెప్పారు? మీకు తెలియదు అంతే. మేము ఆ విషయాలను బయటకు చెప్పడం లేదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అని ఆయన అన్నారు. ఈ ఘటన వెనుక ఎవరున్నారో తనకు తెలుసని కూడా శివకుమార్ చెప్పారు. తన దగ్గర దీనికి సంబంధించిన రికార్డులు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఆ వ్యక్తుల పేర్లు, ఆ రికార్డులను మాత్రం ఆయన బయటపెట్టలేదు. రాజకీయ నాయకులను ఇలాంటి పద్ధతుల్లో ఇరికించే ప్రయత్నాలు జరగవచ్చని శివకుమార్ తన మంత్రివర్గ సహచరులను కూడా హెచ్చరించినట్లు చెప్పారు. వ్యక్తిగత సహాయకులు, ఫోన్ కాల్స్ లేదా ఇతర మార్గాల ద్వారా నాయకులను సంప్రదించే ప్రయత్నాలు జరగవచ్చని వారికి చెప్పినట్లు తెలిపారు.

Also Read : డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనకునే వారికి షాక్.. మారిన రూల్స్ ఇవే!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.