
Anbil Mahesh : తమిళనాడులో మాజీ మంత్రి, డీఎంకే నేత అన్బిల్ మహేష్ పొయ్యామొళి అరెస్ట్ అయ్యారు. ప్రైవేట్ స్కూళ్లకు లైసెన్సులు, ప్రభుత్వ అనుమతులు ఇప్పిస్తామంటూ రూ.100 కోట్ల వరకు డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల నుంచి డబ్బులు తీసుకుని ప్రభుత్వ అనుమతులు ఇప్పించే వ్యవహారంలో 177 స్కూళ్లు ప్రభావితమైనట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తులో సేకరించిన డిజిటల్ ఆధారాలు, విచారణలో తీసుకున్న వాంగ్మూలాల ఆధారంగా అన్బిల్ మహేష్‌ను నిందితుడిగా చేర్చారు.
అవినీతి, నమ్మక ద్రోహానికి సంబంధించిన ఆరోపణలపై ఆయనపై కేసు నమోదు చేశారు. మాజీ మంత్రిపై అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనలను కూడా పోలీసులు పెట్టారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను అన్బిల్ మహేష్ ఖండించారు. తనపై ఉన్న కేసును కొట్టివేయాలని కోర్టును కూడా ఆశ్రయించారు. మరోవైపు డీఎంకే ఈ అరెస్ట్‌పై ప్రభుత్వాన్ని విమర్శించింది. రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకే దర్యాప్తు సంస్థలను ప్రభుత్వం ఉపయోగిస్తోందని ఆరోపించింది.
అన్బిల్ మహేష్ అరెస్ట్‌కు ముందు ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పెట్టుకున్న పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. జస్టిస్ వి. లక్ష్మీనారాయణ్ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలన్న ఆయన అభ్యర్థనను తిరస్కరించారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఇప్పటికే తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ అన్బిల్ మహేష్ మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు.
Also Read : లవర్‌కు ఆర్మీ సీక్రెట్స్ లీక్.. మాజీ ఆర్మీ కెప్టెన్ అరెస్ట్!
ఎలా మొదలైంది ఈ కేసు?
తమిళనాడు ప్రైవేట్ స్కూళ్ల సంఘాల సమాఖ్య కార్యదర్శి ఇళంగోవన్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు మొదలైంది. ప్రైవేట్ స్కూళ్లకు శాశ్వత గుర్తింపు, స్కూల్ స్థాయి పెంపు, నిర్మాణ అనుమతులు, ఇతర ప్రభుత్వ అనుమతులు ఇప్పిస్తామని చెప్పి తన నుంచి డబ్బులు తీసుకున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో మొదట తమిళనాడు ప్రైవేట్ స్కూళ్ల సంఘం అధ్యక్షుడు బీటీ అరసుకుమార్, మరికొందరు కార్యవర్గ సభ్యులపై ఆరోపణలు వచ్చాయి. ప్రైవేట్ స్కూళ్ల నుంచి సభ్యత్వ ఫీజులు, ఇతర డబ్బులు వసూలు చేసి ప్రభుత్వ అనుమతులు ఇప్పిస్తామని వారు హామీ ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో మాజీ మంత్రి అన్బిల్ మహేష్ పాత్ర కూడా ఉందని పోలీసులు చెబుతున్నారు.
Also Read : నేడే జియో ఐపీఓ అలాట్మెంట్.. కేటాయింపు స్టేటస్, జీఎంపీ వివరాలు ఇవే!









