Himalayas: జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ, డోడా, కిష్త్వార్‌ జిల్లాల్లో ఇటీవల సంభవించిన కుండపోత వర్షాలు, భీకర వరదలు, కొండచరియలు విరిగిపడటం జనజీవితాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేశాయి. కేవలం జమ్మూకశ్మీర్‌లోనే కాకుండా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి పర్వత ప్రాంతాల్లోనూ తరచూ ఇలాంటి ఘోర ఉత్పాతాలు పునరావృతమవుతున్నాయి. గతంలోనూ వర్షాలు కురిసినప్పటికీ, ప్రస్తుత కాలంలో వాటి తీవ్రత ఊహించని రీతిలో పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వీటిని ఇకపై సాధారణ విపత్తులుగా పరిగణించలేమని పర్యావరణ వేత్తలు స్పష్టం చేస్తున్నారు.

ఈ వినాశనానికి ప్రధాన కారణం వాతావరణ మార్పులకు మానవ నిర్లక్ష్యం తోడవడమేనని స్పష్టమవుతోంది. హిందూకుష్‌ హిమాలయ ప్రాంత ఉష్ణోగ్రతలు 1950 తర్వాత ప్రపంచ సగటు కంటే వేగంగా, దాదాపు 2 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగాయి. గడిచిన రెండు దశాబ్దాల్లోనే జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత ఒక డిగ్రీ మేర పెరిగింది. ఈ తీవ్రమైన వేడిమి వల్ల కుంభవృష్టులు (Cloudbursts), ఆకస్మిక వరదల ప్రమాదం పెరిగి పర్వతాలు విరిగిపడటంతో పాటు వేసవిలో తీవ్రమైన కార్చిచ్చులు వ్యాపించి విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి.

భారతదేశానికి సహజ రక్షాకవచాలుగా, జీవనదులకు పుట్టిళ్లుగా నిలుస్తున్న హిమాలయాలు 11 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. భౌగోళికంగా ఇవి నవీన పర్వతాలు (Young Fold Mountains) కావడంతో వీటిలో భూకంప కదలికలు నిరంతరం కొనసాగుతుంటాయి ,నేల పొరలు అత్యంత బలహీనంగా ఉంటాయి. అయితే ఈ అస్థిరతను ఏమాత్రం పట్టించుకోకుండా అభివృద్ధి పేరిట కొండవాలులను ఇష్టారీతిగా తవ్వేస్తూ రహదారులు, సొరంగాలు,హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణాలు చేపడుతున్నారు.

Also Read : LPG సిలిండర్ల ధరకు చెక్.. ఇక ‘ఇథనాల్’ గ్యాస్‌తో వంట

పర్యాటక రంగం పేరిట వరద మైదానాలను (Floodplains) ఆక్రమించి విచక్షణారహితంగా నిర్మాణాలు చేపడుతుండటం పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తోంది. ఫలితంగా భారత భూభాగంలోని హిమాలయాల్లో చెట్ల విస్తీర్ణం కేవలం రెండేళ్ల వ్యవధిలోనే 2.27 శాతం మేర తగ్గిపోయింది. చెట్లు లేకపోవడంతో వర్షాలు పడినప్పుడు నేల అదుపుతప్పి తీవ్రస్థాయిలో కొండచరియలు విరిగిపడటం, ప్రవాహాలు వరదలుగా మారి గ్రామాలు, పట్టణాలపై విరుచుకుపడటం జరుగుతోంది.

ఈ మానవ నిర్మిత విపత్తులు సంభవించిన ప్రతిసారీ కోలుకోలేని స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతోంది. గతంలో ఒక్క జమ్మూకశ్మీర్‌లోనే దాదాపు 200 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోగా, 8 వేలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి, 78 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అలాగే 2020-23 మధ్యకాలంలో ఒక్క ఉత్తరాఖండ్‌లోనే ప్రమాదకర పరిస్థితుల వల్ల 213 మంది మృత్యువాత పడ్డారు. రోజురోజుకూ పెరుగుతున్న ఈ విలయాలు మున్ముందు రాబోయే భారీ ముప్పునకు హెచ్చరికలుగా నిలుస్తున్నాయి.

మరోవైపు భూతాపానికి తోడు వాహనాల పొగ, పరిశ్రమల కాలుష్యం,పంట అవశేషాల దహనం వల్ల నల్లటి బూడిద (Black Carbon) హిమాలయాల మంచు పొరలపై చేరుతోంది. దీనివల్ల సూర్యకాంతి సోకినప్పుడు మంచు త్వరగా కరిగిపోతుండగా, ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల మంచు కురవడం కూడా తగ్గిపోతోంది. తత్ఫలితంగా హిమానీనదాలు (Glaciers) వేగంగా కరిగిపోతూ ఊహించని రీతిలో హఠాత్ వరదల ముప్పును పెంచుతున్నాయి.

పరిస్థితి ఇలాగే ఉంటే ఈ శతాబ్దం చివరి నాటికి హిందూకుష్ హిమాలయాల్లో ఉన్న ప్రస్తుత హిమానీనదాల పరిమాణంలో 80 శాతం మేర కనుమరుగవుతాయని శాస్త్రీయ అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అదే గనుక జరిగితే, గంగా-సింధు మైదాన ప్రాంతాలలో సాగు,తాగునీటికి తీవ్రమైన ఎద్దడి ఏర్పడుతుంది. ఇది ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 70 కోట్ల మంది ప్రజల జీవితాలను, జీవనోపాధిని తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉంది.

ఇంతటి పెను విపత్తును నివారించాలంటే హిమాలయ ప్రాంతాల్లో జరుగుతున్న పర్యావరణ విధ్వంసానికి తక్షణమే అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. మహేశ్‌ కమిటీ, చోప్రా సంఘం వంటి నిపుణుల కమిటీలు చేసిన విలువైన సూచనలను ప్రభుత్వాలు గట్టిగా అమలు చేయాలి. సుప్రీంకోర్టు స్పష్టం చేసినట్లుగా – మౌలిక వసతుల కల్పన, ఆర్థిక ప్రగతి పనులతో పాటు పర్యావరణ పరిరక్షణ మధ్య ప్రభుత్వాలు సరైన సమతౌల్యాన్ని పాటిస్తేనే హిమాలయాలను, వాటిని నమ్ముకున్న కోట్ల మంది భవిష్యత్తును కాపాడుకోగలం.

Also Read : కట్టలు తెంచుకున్న స్టూడెంట్స్ ఆగ్రహం

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.