Floods : దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు (Flash Floods) బీభత్సం సృష్టించాయి. లార్నూ ప్రాంతంలోని గురిద్రమన్‌ గ్రామాన్ని మధ్యాహ్నం సమయంలో వరద నీరు ఒక్కసారిగా ముంచెత్తడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వరద ఉధృతికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వరద నీరు గ్రామంలోకి ప్రవేశించిన సమయంలో స్థానిక పాఠశాలలో పలువురు విద్యార్థులు చిక్కుకుపోగా, స్థానికులు, గ్రామస్తులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

రంగంలోకి SDRF.. అస్తవ్యస్తమైన జనజీవనం
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ వరదల కారణంగా పలువురు మృతి చెందగా, వందలాది మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. భారీ వర్షాల ధాటికి దక్షిణ కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారి పూర్తిగా దిగ్బంధం కావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Also Read : PoKలో రేగుతున్న తిరుగుబాటు: 78 ఏళ్ల నాటి జిన్నా కుతంత్రాన్ని పునరావృతం చేస్తున్న పాకిస్తాన్

ప్రమాదకర స్థాయిలో జీలం నది.. విద్యుత్ సరఫరాకు బ్రేక్
కశ్మీర్ లోయలో పరిస్థితి మరీంత ఆందోళనకరంగా మారింది. ప్రధాన నది అయిన జీలం ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. వరద నీరు పోటెత్తడంతో పలు ప్రాంతాల్లోని విద్యుత్ సబ్‌స్టేషన్లు నీట మునిగాయి, ఫలితంగా విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తూ, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వాతావరణ శాఖ మరో 24 గంటల పాటు కశ్మీర్ లోయకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అధికార యంత్రాంగం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Also Read : జైపూర్‌లో ఘోరం: మరో ఎగ్జామ్ స్కామ్..రూ. 5లక్షలు ఇస్తే పాస్..

ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి
కేవలం జమ్మూకశ్మీర్‌లోనే కాకుండా, ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లోనూ భారీ వర్షాలు పలు ప్రాంతాలను అతలాకూతలం చేశాయి. అక్కడ వరదల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. ముఖ్యంగా కేయీ పన్యోర్ జిల్లాలో వరద ఉధృతికి ఇళ్లు దెబ్బతినడమే కాకుండా, ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ప్రస్తుతం దేశంలోని పలు పర్వత ప్రాంతాల్లో ఇటువంటి విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.