Goa Elections : దేశ రాజకీయాల్లో రెండు ప్రధాన జాతీయ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్‌, బీజేపీలు లేకుండా కూటములు ఏర్పడే అవకాశాలు లేవు. అయితే అనేక ఏండ్లుగా దేశాన్ని పాలిస్తున్న ఈ రెండు పార్టీలకు ప్రత్యమ్నాయంగా మరో కూటమి రావాలని పలు జాతీయ పార్టీలతో పాటు స్థానిక పార్టీలు కూడా కోరుకుంటున్నాయి. గతంలో దీనికి సంబంధించి మాజీ సీఎం కేసీఆర్‌ ప్రయత్నం చేసినా అది ఫలించలేదు. ఈ తరుణంలో ఆయా రాష్ర్టాల్లో కొన్ని పార్టీలు కూటమిగా ఏర్పడే ప్రయత్నం చేస్తు్న్నాయి. తాజాగా వచ్చే ఏడాది గోవా శాసనసభకు జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), విజయ్ సర్దేశాయ్ నేతృత్వంలోని గోవా ఫార్వర్డ్ పార్టీ (GFP) లు కలిసి ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాయి. ఈ రెండు పార్టీలు ఉమ్మడిగా ‘గోవా ఫస్ట్’ (Goa First) పేరుతో కూటమిగా ఏర్పడినట్లు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు ప్రకటించారు. ఆదివారం గోవాలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. గోవాలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల లాలూచీ రాజకీయాన్ని అంతమొందించేందుకే కూటమిగా ఏర్పడినట్లు ఆయన స్పష్టం వెల్లడించారు.

కాగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్నాళ్లూ గోవా ప్రజలకు బీజేపీ లేదా కాంగ్రెస్ తప్ప మరొక ప్రత్యామ్నాయం లేకపోయిందన్నారు. కానీ ప్రజలు కోరుకుంటున్న అసలైన, పటిష్టమైన ప్రత్యామ్నాయం ‘గోవా ఫస్ట్’ కూటమితో సాకారమవనుందన్నారు. మేం మా స్వశక్తిపైనే ఈ ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ఫిరాయింపుదారులతోనే నడుస్తోందని ఆరోపించారు. ఆ పార్టీ ఎటువంటి సిద్ధాంతాలు లేవన్నారు. ఇది కేవలం సొంత జేబులు నింపుకునే ‘పాకెట్ ఫస్ట్’ ప్రభుత్వం మాత్రమేనని ఎద్దేశా చేశారు. బీజేపీ పాలనపై నిరాశ ఉన్నా వారు తమ ‘గోవా ఫస్ట్’ కూటమిని ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్ సహా 7 మంది రాజ్యసభ ఎంపీల పార్టీ ఫిరాయించడంపై కేజ్రీవాల్ తొలిసారి స్పందించారు. మా పార్టీ ద్వారానే వారు రాజ్యసభకు వెళ్లారు. ప్రజలు వారిని నేరుగా ఎన్నుకోలేదన్నారు. పార్టీకి వారు తీవ్రమైన ద్రోహం చేశారని ఆరోపించారు. ఈ పరిణామం మా ఎంపిక విధానంలో ఉన్న బలహీనతను బయటపెట్టిందని, ఇది ఆప్‌కు ఒక పెద్ద గుణపాఠం అన్నారు. ఇకపై ఎవరినైనా రాజ్యసభకు పంపే ముందు వారు నమ్మదగినవారా లేదా అని 100 సార్లు వారి విశ్వసనీయతను తనిఖీ చేశాకే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.