mumbai rains

Mumbai Rains : ముంబై నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆదివారం ఉదయం వాతావరణం దారుణంగా మారడంతో ఎయిర్‌పోర్ట్ అధికారులు రన్‌వేపై విమానాల రాకపోకలను గంటపాటు పూర్తిగా నిలిపివేశారు. దీనివల్ల పలు విమానాలు రద్దు కాగా, మరికొన్ని ఇతర నగరాలకు దారిమళ్లించాల్సి వచ్చింది. వందలాది విమానాలు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వాతావరణం అనుకూలించకపోవడంతో ఇండిగో సంస్థకు చెందిన నాలుగు విమానాలు పూర్తిగా రద్దయ్యాయి. అలాగే ముంబై రావాల్సిన 13 విమానాలను అధికారులు పక్కనే ఉన్న ఇతర విమానాశ్రయాలకు దారిమళ్లించారు. అయితే వాతావరణం కాస్త కుదుటపడ్డాక ఆ విమానాలు మళ్లీ ముంబైలోనే ల్యాండ్ అయ్యాయి. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్‌రాడార్24 సమాచారం ప్రకారం.. ముంబై నుంచి బయలుదేరాల్సిన విమానాల్లో 90 శాతం విమానాలు సగటున 65 నిమిషాల పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి. అలాగే ముంబై రావాల్సిన విమానాల్లో 45 శాతం ఆలస్యంగా వస్తున్నాయి.

అదానీ గ్రూప్, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కలిసి నడుపుతున్న ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఈ పరిస్థితిపై ఒక ప్రకటన విడుదల చేసింది. ఆదివారం ఉదయం 10:17 గంటల సమయంలో గంటకు 42 నాట్స్ వేగంతో బలమైన గాలులు వీచాయి. భారీ వర్షం వల్ల విమానాలు నడపడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. దాంతో ప్రయాణికులు, విమానాల భద్రత కోసం నిబంధనల ప్రకారం రన్‌వే ఆపరేషన్లను తాత్కాలికంగా ఆపాము” అని తెలిపింది. గంట తర్వాత వాతావరణం మెరుగుపడటంతో రన్‌వేను మళ్లీ ప్రారంభించినట్లు పేర్కొంది.

ఢిల్లీ-ముంబై, ముంబై-ఇండోర్, ఇండోర్-ముంబై, ముంబై-ఢిల్లీ మార్గాల్లో నడిచే నాలుగు ఇండిగో విమానాలు రద్దయ్యాయి. దీనిపై ఇండిగో సంస్థ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఢిల్లీ, ముంబైలలో వాతావరణం బాలేనందున విమానాల సమయాలు మారుతున్నాయని, ప్రయాణికులు తమ ఫ్లైట్ స్టేటస్‌ను సరిచూసుకోవాలని కోరింది. ముంబై విమానాశ్రయం సాధారణంగా రోజుకు 980 నుండి 1,000 విమానాల రాకపోకలను నిర్వహిస్తుంది. గంటకు సగటున 48 విమానాలు ఇక్కడి నుంచి నడుస్తుంటాయి. అలాంటి బిజీ ఎయిర్‌పోర్ట్‌లో వాతావరణం దెబ్బతీయడంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.