Punjab Woman :  రాజస్థాన్ రైలు పేలుడు కేసులో పంజాబ్‌కు చెందిన మహక్‌దీప్ కౌర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్‌కు చెందిన ‘షా’ అనే వ్యక్తి చెప్పినట్లు ఆమె ఈ పని చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ పనికి రూ.లక్ష ఇస్తామని ఆశ చూపినట్లు పోలీసులు చెబుతున్నారు. మహక్‌దీప్‌కు పాకిస్థాన్ డ్రగ్స్ స్మగ్లర్లతో సంబంధాలున్న తన మాజీ భర్త, బంధువుల ద్వారా షాతో పరిచయం ఏర్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత అతడి కోసం పనిచేయడం మొదలుపెట్టినట్లు చెబుతున్నారు. ఈ కేసులో దేవిందర్ సింగ్ అనే యువకుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు నెలల క్రితమే అతడికి మహక్‌దీప్‌తో పరిచయం ఏర్పడిందని కుటుంబ సభ్యులు తెలిపారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అతడిని నేరాల్లోకి లాగిందని ఆరోపించారు.

మహక్‌దీప్, దేవిందర్ అక్టోబర్‌లో మూడుసార్లు రాజస్థాన్‌కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్టోబర్ 3, 4 తేదీల్లో తొలిసారి వెళ్లి రైల్వే ట్రాక్ దగ్గర బాంబు పెట్టినా అది పేలలేదు. అక్టోబర్ 12న రెండోసారి వెళ్లారు. అక్టోబర్ 30 తర్వాత మూడోసారి వెళ్లి రైల్వే ట్రాక్‌పై పేలుడు పదార్థాలు పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నవంబర్ 3న ఆ బాంబు పేలింది. పేలుడు జరగడానికి రెండు రోజుల ముందు మహక్‌దీప్ ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఆమె తల్లి తెలిపారు. స్నేహితుడిని కలవడానికి వెళ్తున్నానని చెప్పిందన్నారు. పేలుడు జరిగిన నాలుగు, ఐదు రోజుల తర్వాత ఇంటికి తిరిగొచ్చిందని చెప్పారు. మరోవైపు దేవిందర్ కూడా ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లినట్లు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. మహక్‌దీప్ మాజీ భర్త కరణ్‌దీప్ సింగ్ ఏడాది క్రితం డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడు. అతడి దగ్గర డ్రగ్స్‌తో పాటు ఆయుధాలు కూడా దొరికినట్లు సమాచారం. మహక్‌దీప్ సోదరుడు కూడా డ్రగ్స్ కేసులో జైలులో ఉన్నాడు.

పంజాబ్ పోలీసులు, రాజస్థాన్ ఏటీఎస్ కలిసి గురుదాస్‌పూర్ జిల్లాలో ఇద్దరినీ అరెస్ట్ చేశారు. వారి దగ్గర రెండు పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్‌లో ఉన్న షా ఎవరు? పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో రాజస్థాన్‌లోని గంగాపూర్ సిటీలో బబిత అనే మహిళను కూడా ఏటీఎస్ అరెస్ట్ చేసింది. ప్రేమ పేరుతో మహిళలను దగ్గర చేసుకుని, డబ్బు ఆశ చూపి నేరాలకు ఉపయోగిస్తున్నారా? అనే కోణంలో భద్రతా సంస్థలు విచారణ జరుపుతున్నాయి.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.