
హైదరాబాద్‌లో త్వరలో ట్రంప్ టవర్స్ రాబోతున్నాయి. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తయిన రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌గా ఇది నిలవనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ‘ట్రంప్ ఆర్గనైజేషన్’, ‘ట్రిబేకా డెవలపర్స్’ ‘ఐరా రియాల్టీ’ సంస్థలు కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట్‌లోని గోల్డెన్ మైల్ రోడ్‌లో ఉన్న సర్వే నంబర్ 109లో ఈ లగ్జరీ టవర్లు నిర్మించనున్నారు.
ఈ ప్రాజెక్ట్‌ను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్ వంటి కీలక ప్రాంతాలకు అతి సమీపంలో నిర్మిస్తున్నారు. మొత్తం 4 ఎకరాల విస్తీర్ణంలో 65 అంతస్తులతో 242 మీటర్ల ఎత్తులో ఈ టవర్లు ఆకాశాన్ని తాకేలా నిర్మిస్తారు. ఈ నిర్మాణానికి తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఇప్పటికే అనుమతులు కూడా మంజూరు చేసింది. త్వరలోనే ఎంతో ఘనంగా జరగబోయే భూమి పూజ కార్యక్రమానికి డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సభ్యులు స్వయంగా హాజరుకానున్నారు.
ఈ టవర్ల నిర్మాణం దాదాపు 22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జరగనుంది. అందులో అత్యంత విలాసవంతమైన 450కి పైగా 3, 4 బిహెచ్‌కే ఫ్లాట్లతో పాటు డబుల్-హైట్ సింప్లెక్స్ ఇళ్లు,16 ప్రత్యేక పెంట్‌హౌస్‌లు నిర్మిస్తున్నారు. ప్రతి ఇంటికి ప్రైవేట్ లిఫ్ట్ లాబీ సౌకర్యాన్ని కల్పిస్తుండటం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత. అంతేకాకుండా, 28వ ఫ్లోర్ వద్ద రెండు భారీ టవర్లను కలుపుతూ గాల్లో తేలియాడేలా నిర్మించే ‘సస్పెండెడ్ స్కై బ్రిడ్జ్’ ఈ భవనానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
ఇక ఈ అపార్ట్‌మెంట్ల ధరకు వస్తే.. ఒక్కో సాధారణ ఫ్లాట్ రేటు రూ. 5 కోట్ల నుంచి ప్రారంభమై రూ. 18 కోట్ల వరకు ఉంటుంది. అలాగే అత్యంత విలాసవంతమైన పెంట్‌హౌస్‌ల ధరలను రూ. 30 కోట్ల నుంచి రూ. 62 కోట్ల వరకు నిర్ణయించారు. నిర్మాణం ప్రారంభం కాకముందే ఇప్పటికే 8 పెంట్‌హౌస్‌లు అమ్ముడయ్యాయి. ఇందులో ఒక పెంట్‌హౌస్ ఏకంగా రూ. 62 కోట్లకు అమ్ముడుపోగా, కేవలం పెంట్‌హౌస్‌ల విక్రయాల ద్వారానే రూ. 250 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.
స్థలంతో కలిపి మొత్తం ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి దాదాపు రూ.2 వేల కోట్లు ఖర్చు అవుతుందని డెవలపర్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మొత్తం రూ. 4,200 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని భావిస్తున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఈ ‘ట్రంప్ టవర్స్’ ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించడంతో పాటు నగరానికి అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త గుర్తింపును తీసుకురానుంది.









