indigo flight 6e 6115 fire emergency landing hyderabad
indigo flight 6e 6115 fire emergency landing hyderabad

తరచుగా విమాన ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా అలాంటి ప్రమాదమే తృటిలో తప్పింది. ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడం భయాందోళనలను రేకెత్తించింది. ఆ సమయంలో పైలట్లు వెంటనే అప్రమత్తం కావడంతో ఆ ఫ్లైట్‌ను హైదరాబాద్‌కు మళ్లించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళితే..

ఇండిగో 6E 6115 నంబర్ విమానం ఢిల్లీ నుంచి చెన్నైకి బయల్దేరింది. ప్రయాణం సాఫీగా సాగుతున్న సమయంలో.. ఓ పాసింజర్ బ్యాగ్‌లోంచి చిన్నగా పొగలు రావడం మొదలైంది. ఆ పొగలు కాస్త వేగంగా వ్యాపించి మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరయ్యారు. బ్యాగు మొత్తం మంటలతో ఉవ్వెత్తున ఎగసిపడటంతో వెంటనే స్పందించిన విమాన సిబ్బంది, పైలట్లు వాటిని ఆర్పేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.

చివరికి మంటలను అదుపుచేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు పైలట్లు వెంటనే సమీపంలో ఉన్న హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు విమానాన్ని మళ్లించారు. కాగా విమానంలో ప్రయాణికుడి బ్యాగ్‌లో ఉన్న పవర్‌బ్యాంక్ నుంచే మంటలు చెలరేగినట్లు సమాచారం. అయితే అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనే సమాచారం తెలియనప్పటికీ.. వారందరూ క్షేమంగానే ఎలాంటి గాయాలు బారిన పడకుండా ఉండటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

విమానం ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇండిగో సంస్థ వారి ప్రయాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా వారికి అల్పాహారం, తాగునీరు అందించి.. ఈ అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది.

                   వీడియో కోసం క్లిక్ చేయండి