
New Delhi : ఢిల్లీలో ఓ పదేళ్ల బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తనను అంకుల్ అని పిలిచే వ్యక్తిని ముసలివాడయ్యే వరకు జైలులోనే ఉంచాలని ఆ బాలిక కోర్టును కోరింది. బాలిక మాటలను జడ్జి కూడా చాలా సీరియస్‌గా తీసుకున్నారు. తీర్పు చివర్లో ఆ చిన్నారికి ప్రత్యేకంగా ఓ సందేశం రాశారు. రోహిణి కోర్టు జడ్జి రాజనీ రంగా బాలికను ఉద్దేశించి.. నువ్వు చెప్పిన మాటలను కోర్టు విన్నది. నువ్వు కోరినట్టే నిన్ను బాధపెట్టిన వ్యక్తి జీవితాంతం జైలులోనే ఉంటాడు అని చెప్పారు. అతడు జైలులోనే ముసలివాడవుతాడు. అక్కడే చనిపోతాడు. ఇక నిన్ను, నీ చెల్లిని లేదా మరే చిన్నారిని అతడు ఎప్పటికీ బాధపెట్టలేడు అని జడ్జి బాలికకు ధైర్యం చెప్పారు.
బాలికను జడ్జి చాలా ధైర్యమైన చిన్నారిగా ప్రశంసించారు. కోర్టుకు వచ్చి తనను బాధపెట్టిన వ్యక్తిని గుర్తించి చూపించిందని, నిజం చెప్పిందని అన్నారు. జరిగిన విషయాన్ని తల్లికి చెప్పి భయపడకుండా ముందుకు వచ్చిందని చెప్పారు. ఆమె ధైర్యం వల్ల మరో చిన్నారికి అతడి వల్ల ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉంటుందని పేర్కొన్నారు. నీ బాల్యాన్ని తిరిగి ఇవ్వడం మా వల్ల కాదు. కానీ నువ్వు చెప్పిన మాటలను కోర్టు విన్నది. నీ మాటకు విలువ ఇచ్చింది అని జడ్జి చెప్పారు. ఇక జరిగిన విషయాలను మర్చిపోయి జీవితంలో ముందుకు వెళ్లాలని సూచించారు. స్కూల్‌కు వెళ్లాలని, స్నేహితులతో ఆడుకోవాలని, నవ్వుతూ ఉండాలని, మంచి కలలు కనాలని చెప్పారు. నీ ధైర్యాన్ని కోర్టు ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని తెలిపారు.
Also Read : టీవీ, ఏసీ, ఫ్రిజ్.. అన్నీ ఖరీదే! మహా ఖరీదైన రోజులు రాబోతున్నాయా?
ఈ జడ్జి రాసిన సందేశాన్ని బాలికకు తప్పకుండా అందించాలని ఢిల్లీ హైకోర్టు అధికారులను ఆదేశించింది. ఈ లేఖను ప్రింట్ చేసి బాలికకు లేదా ఆమె కుటుంబ సభ్యులకు ఇవ్వాలని చెప్పింది. అలాగే బాలికకు రావాల్సిన పరిహారం డబ్బులను కూడా అందించాలని ఆదేశించింది. రెండు వారాల్లో ఈ పని పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ కేసు పోక్సో చట్టం కింద నడిచింది. 2023 జూలై 23న ఈ ఘటన జరిగినప్పుడు బాలిక వయసు ఏడేళ్లు. ఇప్పుడు ఆమె వయసు పదేళ్లు. ట్రయల్ కోర్టు జడ్జి బాలికకు రాసిన మాటలను ఢిల్లీ హైకోర్టు కూడా ప్రశంసించింది. దీనిని ‘‘బాలికకు ధైర్యం చెప్పే సందేశం’’గా పేర్కొంది.
ఈ కేసులో సుమిత్ శాక్య అనే వ్యక్తిని కోర్టు దోషిగా తేల్చింది. 12 ఏళ్లలోపు బాలికపై లైంగిక దాడి చేసినట్లు, ఆమెను బెదిరించినట్లు కోర్టు నిర్ధారించింది. దీంతో అతడికి జీవితాంతం జైలులో ఉండేలా శిక్ష విధించింది. అలాగే రూ.1 లక్ష జరిమానా విధించింది. బెదిరింపుల కేసులో మరో ఐదేళ్ల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధించింది. రెండు శిక్షలు ఒకేసారి అమలు కానున్నాయి.
బాలిక, ఆమె కుటుంబం పడిన బాధను దృష్టిలో పెట్టుకుని కోర్టు రూ.10.50 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ డబ్బులు అందాయా లేదా అనే విషయంపై నివేదిక ఇవ్వాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు జైలు శిక్షను ఆపి తనకు బెయిల్ ఇవ్వాలని నిందితుడు హైకోర్టును కోరాడు. అయితే ప్రస్తుతం బెయిల్ ఇవ్వడానికి కోర్టు అంగీకరించలేదు. కేసులో ఉన్న సాక్ష్యాలు, ఫోరెన్సిక్ ఆధారాలను పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసుపై తదుపరి విచారణ నవంబర్ 4, 2026న జరగనుంది. నిందితుడి అప్పీల్‌పై జనవరి 20, 2027న మరోసారి విచారణ జరగనుంది.
Also Read : తెలంగాణ లోకల్ రిజర్వేషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. నాలుగేళ్ల రూల్స్ పై క్లారిటీ









