
Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌కు చెందిన ఆరేళ్ల బాలుడికి అదృష్టం తలుపు తట్టింది. కేవలం రూ.200తో తీసుకున్న లక్కీ డ్రా కూపన్ అతడి కుటుంబానికి ఏకంగా రూ.50 లక్షల విలువైన టయోటా ఫార్చ్యూనర్ కారును తెచ్చిపెట్టింది. శీలంపురాకు చెందిన మెదాన్ష్ రైక్వార్ ఈ లక్కీ డ్రాలో మొదటి బహుమతి గెలుచుకున్నాడు. అభాపురిలోని శ్రీ సర్కార్ ధామ్‌లో నిర్వహించిన లక్కీ డ్రాలో మెదాన్ష్ పేరు మొదటి బహుమతిగా ఎంపికైంది. అయితే ఈ కూపన్‌ను మెదాన్ష్ అమ్మమ్మ కిరణ్ రైక్వార్ కొనుగోలు చేశారు. దాదాపు ఏడాది క్రితం అక్కడ జరిగిన గర్బా కార్యక్రమానికి వెళ్లిన ఆమె రూ.200 పెట్టి లక్కీ డ్రా కూపన్ తీసుకున్నారు. అందులో తన మనవడు మెదాన్ష్ పేరు నమోదు చేశారు.
Also Read : ఆర్నబ్ తుఫాన్ : రైతులకు ఏపీ సర్కార్ భారీ సాయం.. ఎకరాకు రూ.75 వేలు!
అప్పుడు రూ.200 కూపన్ కొన్న కిరణ్‌కు అది ఇంత పెద్ద బహుమతిని తెచ్చిపెడుతుందని అసలు ఊహించలేదు. 2026లో లక్కీ డ్రా ఫలితాలు ప్రకటించగా.. మొదటి బహుమతి మెదాన్ష్కు దక్కినట్లు తెలిసింది. దీంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. మెదాన్ష్ గెలుపుతో వారి ప్రాంతంలోనూ సందడి నెలకొంది. స్థానికులు పెద్ద సంఖ్యలో చేరి బాలుడికి ఘన స్వాగతం పలికారు. డప్పుల మోత మధ్య అతడిని అభినందించారు. కారు అందుకున్న తర్వాత కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి, దేవుడి ఆశీస్సులు కోరుకున్నారు.
ఎప్పటి నుంచో కారు కొనాలన్న ఆ కుటుంబం కల.. ఈ లక్కీ డ్రాతో నెరవేరింది. కేవలం రూ.200తో తీసుకున్న కూపన్ ఏకంగా రూ.50 లక్షల విలువైన కారును గెలిపించడంతో ఈ విషయం సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది. రూ.200తో ఇంత పెద్ద బహుమతి రావడం ఆశ్చర్యంగా ఉందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బాలుడికి అభినందనలు తెలుపుతున్నారు.
ఇక మెదాన్ష్ గెలుచుకున్న టయోటా ఫార్చ్యూనర్ పెద్ద సైజు, ఏడు సీట్ల ఎస్యూవీ. బలమైన నిర్మాణం, ఆకట్టుకునే రూపం, మంచి పనితీరుతో ఈ కారు పేరొందింది. హైలక్స్ వాహనంలో ఉపయోగించే లాడర్ ఫ్రేమ్ ఆధారంగా ఫార్చ్యూనర్‌ను తయారు చేస్తారు. 4×4 సదుపాయం, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటంతో రోడ్లతో పాటు కఠినమైన మార్గాల్లోనూ ఇది ఉపయోగపడుతుంది.
కారులో లెదర్ సీట్లు, 8 అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్లెస్ ఛార్జింగ్, 360 డిగ్రీల కెమెరా వంటి సదుపాయాలు ఉన్నాయి. టయోటా సేఫ్టీ సెన్స్ వంటి భద్రతా ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. 2.7 లీటర్ పెట్రోల్, 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపికలతో పాటు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.
Also Read : కాంగ్రెస్‌కు ఒక్క సీటూ రాలేదు.. ప్రధాని మోదీ బిగ్ సెటైర్









