
మన ఒంట్లో కిడ్నీలు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజంతా రక్తంలో ఉండే చెత్తను, పనికిరాని వ్యర్థాలను వడకట్టి బయటకు పంపేది ఈ కిడ్నీలే. దాంతో పాటు శరీరంలో నీటి శాతాన్ని, లవణాలు, ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను సరిగ్గా కాపాడే బాధ్యత కూడా వీటిదే. అందుకే మన కిడ్నీలు పదిలంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. మనం రోజువారీ చేసే కొన్ని చిన్న చిన్న అలవాట్లు, ముఖ్యంగా పొద్దున్నే నిద్రలేచిన వెంటనే చేసే పొరపాట్లు మెల్లమెల్లగా కిడ్నీలను దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఉదయం పూట అసలు చేయకూడని ఆ మిస్టేక్స్ ఏంటో తెలుసుకుందాం.
లేవగానే నీళ్లు తాగకపోవడం
చాలామంది పొద్దున్నే లేవగానే కాఫీనో, టీనో తాగుతారు. కానీ నీళ్లు తాగడం మర్చిపోతారు. రాత్రంతా ఎనిమిది గంటల పాటు మనం నీళ్లు తాగకుండా నిద్రపోతాం. కాబట్టి ఉదయానికి మన శరీరానికి ద్రవాలు చాలా అవసరం. లేవగానే సరిపడా నీళ్లు తాగకపోతే రోజంతా శరీరం డీహైడ్రేషన్‌కు గురి అవుతుంది. ముఖ్యంగా ఎండలో తిరిగేవారు, బాగా చెమట పట్టే పనిచేసేవారు, రోజూ వ్యాయామం చేసేవారు ఉదయాన్నే నీళ్లు తాగకపోతే కిడ్నీలపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది.
మూత్రాన్ని ఆపుకోవడం
ఈ రోజుల్లో పని ఒత్తిడి లేదా బద్ధకం వల్ల చాలామందికి మూత్రాన్ని ఆపుకునే అలవాటు ఉంటుంది. పొద్దున్న లేవగానే టాయిలెట్‌కి వెళ్లకుండా ఫోన్ చూడటం లేదా పనిలో మునిగిపోవడం చేస్తారు. ఇలా తరచూ మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం వల్ల మూత్రాశయంపై అనవసరమైన భారం పెరుగుతుంది. ఇది ఇన్ఫెక్షన్లకు దారితీయడమే కాకుండా దీర్ఘకాలంలో కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మూత్రం వచ్చినా వెళ్లకుండా ఆపుకోవడం అస్సలు మంచి పద్ధతి కాదు.
జంక్ ఫుడ్ తినడం
పొద్దున్నే తినే టిఫిన్ ఎప్పుడూ తేలికగా, ఆరోగ్యకరంగా ఉండాలి. కానీ చాలామంది ప్యాకేజ్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ మీట్, ఇన్స్టంట్ ఫుడ్స్ లేదా ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలను తింటుంటారు. ఉదయాన్నే శరీరంలోకి సోడియం ఎక్కువగా వెళ్తే రక్తపోటు పెరుగుతుంది. ఈ అధిక రక్తపోటే కిడ్నీల పనితీరు క్షీణించడానికి ప్రధాన కారణం. కాబట్టి ఉదయం పూట వీలైనంత వరకు ఇంట్లో వండిన, తక్కువ ఉప్పు ఉండే సమతుల్య ఆహారాన్ని మాత్రమే ఎంచుకోవడం మంచిది.
నీళ్లకు బదులు కాఫీలు
లేవగానే ఒక కప్పు కాఫీ తాగడం చాలామందికి అలవాటే. పరిమితంగా తాగితే పర్లేదు కానీ, ఉదయాన్నే నీళ్లకు బదులుగా వరసపెట్టి కాఫీలు లేదా ఎనర్జీ డ్రింక్స్ తాగే అలవాటు ఉంటే మాత్రం ప్రమాదమే. వీటిల్లో కెఫీన్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. అసలే ఒంట్లో నీళ్లు లేని సమయంలో కెఫీన్ పానీయాలు ఎక్కువగా తీసుకుంటే డీహైడ్రేషన్ మరింత ఎక్కువవుతుంది. నీళ్లను పక్కనపెట్టి కెఫీన్పైనే ఆధారపడితే కిడ్నీల ఆరోగ్యం త్వరగా పాడవుతుంది.
సొంత వైద్యంతో పెయిన్ కిల్లర్స్ వాడటం
చిన్న తలనొప్పి వచ్చినా, ఒళ్లు నొప్పులు అనిపించినా డాక్టర్ సలహా లేకుండా షాప్‌కి వెళ్లి పెయిన్ కిల్లర్స్ కొనుక్కొని వేసేసుకోవడం ఈ మధ్య బాగా ఎక్కువైంది. ముఖ్యంగా NSAID రకానికి చెందిన నొప్పి బిళ్లలను ఎక్కువ మోతాదులో లేదా ఎక్కువ రోజులు వాడితే అవి నేరుగా కిడ్నీలపై ప్రభావం చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.









