TMC :  పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తురాలు, తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు అయిన చంద్రుమా భట్టాచార్య పార్టీలోని అన్ని పదవులకూ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె తన రాజీనామా లేఖను పంపారు.

జూన్ 3న కాళీఘాట్‌లో జరిగిన సమావేశంలో తనకు అప్పగించిన టీఎంసీ రాష్ట్ర అధ్యక్ష పదవికి, అలాగే పార్టీలో తాను నిర్వహిస్తున్న మిగతా అన్ని బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు చంద్రుమా ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ లేఖలో ఆమె మమతా బెనర్జీని పార్టీ అధినేత్రి అని కాకుండా, మాజీ ముఖ్యమంత్రి అని సంబోధించడం గమనార్హం.

పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 208 సీట్లు గెలుచుకోగా, టీఎంసీ కేవలం 80 సీట్లకే పరిమితమైంది. ఆ తర్వాత టీఎంసీలో తిరుగుబాటు మొదలైంది. మొత్తం 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేలలో 58 మంది తిరుగుబాటు వర్గంలో చేరారు. పార్టీ ఫిరాయింపుల చట్టం నుండి తప్పించుకోవడానికి 52 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా, అంతకంటే ఎక్కువ మందే మమతా బెనర్జీకి ఎదురుతిరిగారు. వీరంతా అరూప్ రాయ్ అధ్యక్షతన ఒక కొత్త జాతీయ కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. 2022లో మహారాష్ట్ర శివసేన పార్టీలో జరిగిన చీలిక లాగే ఇప్పుడు బెంగాల్ టీఎంసీలో కూడా జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే సీనియర్ లీడర్ చంద్రుమా భట్టాచార్య కూడా ఈ తిరుగుబాటు వర్గంలో చేరే అవకాశం ఉందనే ప్రచారం గట్టిగా సాగుతోంది. దీనిపై ఆమెను మీడియా అడగ్గా.. నేను ఇప్పుడేం మాట్లాడను, కాలమే సమాధానం చెబుతుంది అంటూ దాటవేశారు.

 

 

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.