
Jantar Mantar Protest : ఢిల్లీలో CJP నిరసన ఉద్రిక్తంగా మారింది. జంతర్ మంతర్ సమీపంలోని కన్నాట్ ప్లేస్‌లో PTI భవనం దగ్గర పోలీసులపై కొందరు నిరసనకారులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ఆ సమయంలో అక్కడ సుమారు 50 మంది నిరసనకారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారందరినీ అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా CJP చేపట్టిన నిరసన నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులపై రాళ్ల దాడి జరిగినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, అదుపులో ఉన్న CJP నాయకులు అభిజీత్ దీప్కే, ఆశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌లను వేర్వేరుగా ఉంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు పోలీసుల అదుపులోకి తీసుకున్న నిరసనకారుల సంఖ్య సుమారు 400కు చేరింది.
ఢిల్లీలో ర్యాలీ నిర్వహించిన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యకర్తలు పోలీసుల బారికేడ్లను కూల్చివేశారు. ఈ సందర్భంగా పోలీసులు తనపై దాడి చేశారని ఓ నిరసనకారుడు ఆరోపించాడు. అలాగే, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్, వామపక్ష పార్టీల కార్యకర్తలు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వెలుపల ఆందోళన నిర్వహించారు. వారిలో పలువురిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.
ఇదిలా ఉండగా, ఢిల్లీలోని తన నివాసం వెలుపల తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీతో పాటు తమ పార్టీకి చెందిన మరో ఐదుగురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మాజీ ఎంపీ సాకేత్ గోఖలే తెలిపారు. మమతా దీదీతో పాటు మమ్మల్ని ఐదుగురిని ఢిల్లీ పోలీసులు, CRPF సిబ్బంది మా నివాసం బయటే అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలోకి ఎక్కించారు. మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదు అని గోఖలే తన పోస్టులో పేర్కొన్నారు. భారత్‌లో ప్రజాస్వామ్యం చనిపోయిందని గోఖలే వ్యాఖ్యానించారు.
మరోవైపు చండీగఢ్‌లోనూ నిరసనలు జరిగాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చండీగఢ్‌లోని ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వెలుపల ఆందోళన చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియాతో పాటు పంజాబ్‌కు చెందిన AAP నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో CJP నిరసన సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ బజరంగ్ జాదవ్‌కు గాయమైంది. దీనిపై ఆయన స్పందిస్తూ.. అల్లర్లకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకునే సమయంలో తనను తోసేశారని, దీంతో గాయమైందని చెప్పారు.









