
Building Collapse : ఢిల్లీలోని సీమాపురిలో ఐదు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. సీమాపురిలో భవనం కూలిపోయిన ఘటనపై మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ ఫైర్ సర్వీస్‌కు సమాచారం అందింది. వెంటనే ఫైర్ సిబ్బంది వాహనాలతో అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read : ఎయిర్టెల్ కస్టమర్లకు బిగ్ షాక్.. రేపటి నుంచి కొత్త రేట్లు
ఘటనాస్థలికి సంబంధించిన ఫొటోల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు శిథిలాల మధ్య కనిపించారు. కొంతమంది చేతులతోనే రాళ్లు, శిథిలాలను పక్కకు తొలగిస్తూ దారి చేసేందుకు ప్రయత్నించారు. మరికొందరు తమ మొబైల్ ఫోన్లలో ఘటనను వీడియోలు తీస్తూ కనిపించారు. ఈ ఘటనకు నెల రోజుల ముందు ఢిల్లీలోని సత్య నికేతన్‌లో హాస్టల్ భవనం కూలిన ఘటన చోటుచేసుకుంది. ఆ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు.
మరోవైపు సీమాపురి ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు అటువైపు వెళ్లకుండా ఉండాలని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. రోడ్లు ఖాళీగా ఉంటే అంబులెన్సులు, సహాయక బృందాల వాహనాలు వేగంగా ఘటనాస్థలికి చేరుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. సీమాపురి గోల్ చక్కర్, డీఎల్ఎఫ్ భోపురా, చుట్టుపక్కల రోడ్లలో ట్రాఫిక్ ప్రభావితమైందని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఎక్స్‌లో తెలిపారు. వీలైనంత వరకు ఈ ప్రాంతానికి రావద్దని, ఘటనాస్థలం దగ్గర వాహనాలను ఆపడం, పార్కింగ్ చేయడం లేదా గుమిగూడటం చేయవద్దని సూచించారు. ట్రాఫిక్ సిబ్బంది ఇచ్చే సూచనలను పాటించాలని కోరారు.
Also Read : IAFకు కొత్త బాస్.. ఆశుతోష్ దీక్షిత్‌కు కీలక బాధ్యతలు!









