Pakistan :  వినాయక చవితి వేడుకలు కేవలం భారత్‌కే పరిమితం కాలేదు. పాకిస్థాన్‌లోని మరాఠీ కుటుంబాలు కూడా వినాయక చవితిని ఎంతో ఆనందంగా జరుపుకున్నాయి. కరాచీలో నివసిస్తున్న మరాఠీ మహిళలు కలిసి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన మహారాష్ట్రకు చెందిన పలువురు నెటిజన్లు పాకిస్థాన్‌లోని మరాఠీలకు ప్రేమ, శుభాకాంక్షలు చెబుతున్నారు.

కరాచీలోని మరాఠీ మహిళా మండలి ఆధ్వర్యంలో భండారా నిర్వహించినట్లు వీడియోలో కనిపిస్తోంది. మహిళలు స్వయంగా వంటలు తయారు చేసి భక్తులకు వడ్డిస్తున్నారు. పాకిస్థాన్‌లో నివసించే అమర్ అనే మరాఠీ వ్యక్తి ఈ వీడియోను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. వీడియోలో మహిళలు అందరికీ భోజనం వడ్డిస్తూ కనిపించారు.

ఈ సందర్భంగా అమర్ అక్కడ ఉన్న మహిళలను పలకరించి.. ఏం చేస్తున్నారని అడిగారు. అందుకు ఓ మహిళ తాము భండారా తయారు చేస్తున్నామని చెప్పారు. ఎలాంటి భండారా వండుతున్నారని అడగగా.. సోయాబీన్, బంగాళాదుంపలతో భండారా చేస్తున్నామని తెలిపారు. మహిళలు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు వీడియోలో కనిపించింది.

ప్రతి సంవత్సరం తాము ఇలా కలుసుకుంటామని, భక్తులకు సేవ చేస్తామని మరో మహిళ చెప్పింది. ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆమె తెలిపింది. వీడియోలో మరికొంతమంది మహిళలు కూడా కనిపించారు. పాకిస్థాన్‌లో ఉన్నప్పటికీ తమ సంప్రదాయాలను కొనసాగిస్తూ వినాయక చవితి వేడుకలను నిర్వహించడం ఆసక్తికరంగా మారింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహారాష్ట్రకు చెందిన నెటిజన్లు స్పందిస్తున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్‌లో నివసిస్తున్న మరాఠీ ప్రజలకు పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు. కామెంట్లలో చాలామంది జై మహారాష్ట్ర అంటూ పోస్టులు చేస్తున్నారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.