దేశవ్యాప్తంగా వివిధ పోటీ పరీక్షలు, ఉద్యోగ నియామక పరీక్షల్లో తరచుగా పేపర్ లీకేజీలు అవుతున్నాయి. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. పేపర్ లీకేజీ కేసుల విచారణను వేగవంతం చేయడానికి, అక్రమాలకు పాల్పడిన దోషులకు కఠిన శిక్షలు పడేలా చూడటానికి ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దేశంలో యువత భవిష్యత్తు, వారి సంక్షేమం కంటే తమ ప్రభుత్వానికి మరేదీ ముఖ్యం కాదని.. వారే దేశానికి వెన్నుముక అని స్పష్టం చేశారు.

ఏళ్ల తరబడి రాత్రింబవళ్లు కష్టపడి చదివి, తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే లక్షలాది మంది విద్యార్థుల శ్రమను, ఆశయాలను కొందరు స్వార్థపరులు, క్రిమినల్ ముఠాలు నీరుగారుస్తున్నాయని ప్రధాని మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యువత కన్న కలలను, వారి భవిష్యత్తును నాశనం చేసేలా ప్రవర్తించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడే ముఠాలపై, అలాగే వ్యవస్థలో ఉంటూ వారికి పరోక్షంగా సహకరించే అధికారులపై అత్యంత కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని ప్రధాని హామీ ఇచ్చారు.

సాధారణ కోర్టుల్లో కేసుల విచారణ ఏళ్ల తరబడి ఆలస్యం కావడం వల్ల బాధితులైన విద్యార్థులకు సమయానికి న్యాయం జరగడం లేదన్నారు. ఈ క్రమంలోనే నిందితులు చట్టంలోని సందుగొందులను వాడుకుని బయటపడుతున్నారని ప్రధాని అభిప్రాయపడ్డారు. అందుకే ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా సమయానుకూలంగా, అత్యంత వేగంగా విచారణ ప్రక్రియను పూర్తి చేసి నిందితులకు కఠిన శిక్షలు అమలయ్యేలా చూస్తామని వివరించారు. దీనివల్ల నేరస్థుల్లో భయం పెరిగి అక్రమాలకు పాల్పడకుండా అడ్డుకట్ట వేయవచ్చని భావిస్తున్నారు.

భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు, అవకతవకలు ఏమాత్రం మళ్లీ రీపిట్ కాకుండా సరికొత్త సాంకేతికతతో పరీక్షల వ్యవస్థను రూ పొందిస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్య కోసం కష్టపడే ప్రతి ఒక్క అభ్యర్థి శ్రమకు తగిన న్యాయం జరగాలన్నదే తమ ఆకాంక్ష అని మోదీ తెలిపారు.