
Rahul Gandhi : కేంద్ర ప్రభుత్వం, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలను పట్టించుకోవడం లేదన్న వార్తల నేపథ్యంలో ఆయన సంచలన కామెంట్స్ చేశారు. ఓట్లు చోరీ అవుతున్నాయని ఆరోపించిన రాహుల్.. జ్ఞానేశ్ కుమార్‌ను దేశద్రోహిగా అభివర్ణిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ధ్వంసమవుతుంటే కాంగ్రెస్ చూస్తూ మౌనంగా ఉండబోదని హెచ్చరించారు. ఓట్లు చోరీ అవుతున్నప్పుడు ఎంపీలు రూపొందించిన చట్టాల చట్టబద్ధతపైనా ప్రశ్నలు తలెత్తుతాయని వ్యాఖ్యానించారు.
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో బీజేపీ 30 ఏళ్లపాటు అధికారంలో ఉంటుందని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే 400కుపైగా స్థానాలు సాధిస్తుందని చేసిన వ్యాఖ్యలను రాహుల్ ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ నాయకుడూ ఇంత ధీమాగా ఉండలేరని, దీనికి కారణం యాంటీ-ఇన్‌కంబెన్సీ అనే సహజ రాజకీయ ప్రభావమని అన్నారు.
1971లో బంగ్లాదేశ్ యుద్ధ విజయం తర్వాత అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రజాదరణ గరిష్ఠ స్థాయికి చేరుకున్నప్పటికీ.. ఏడాది, రెండేళ్లలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని రాహుల్ పేర్కొన్నారు. కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల నేతల విషయంలోనూ ఇదే జరుగుతుందని, అయితే ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ విషయంలో మాత్రం యాంటీ-ఇన్‌కంబెన్సీ ఎందుకు కనిపించడం లేదన్నదే తమ ప్రశ్న అని అన్నారు.
హరియాణా, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో గత ఐదు దశాబ్దాలుగా అధికార మార్పిడి జరుగుతూ వచ్చిందని రాహుల్ చెప్పారు. అయితే ప్రస్తుతం యాంటీ-ఇన్‌కంబెన్సీ ప్రభావం కనిపించకపోవడానికి కారణమేంటన్న ప్రశ్న తమను చాలాకాలంగా వేధించిందన్నారు. చివరకు దీనికి ఓట్ చోరీ కారణమనే నిర్ధారణకు వచ్చామని ఆయన వ్యాఖ్యానించారు.









