Rahul Gandhi Arrest :  ఓటర్ల జాబితా సవరణను వ్యతిరేకిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి నేతలు చేపట్టిన ఆందోళన రెండో రోజూ కొనసాగింది. ఈ నిరసనకు నాయకత్వం వహించిన కీలక నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలో పాల్గొన్న ఇతర నేతలను కూడా పోలీసులు విడిచిపెట్టలేదు. వారిని బలవంతంగా బస్సుల్లోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. అయితే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాత్రం అక్కడే బైఠాయించి నిరసన కొనసాగిస్తున్నారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు కోరుతున్నప్పటికీ వారు అందుకు అంగీకరించలేదు. ప్రియాంక గాంధీతో పాటుగా పలువురు మహిళ నేతలు రోడ్డుపైన పడుకుని నిరసనకు దిగారు. రాహుల్ గాంధీ మాత్రం అక్కడే నిల్చుని పోలీసులు వెంట వెళ్లేందుకు నిరాకరించారు. దమ్ముంటే తమర్ని కదిలించాలని సవాల్ విసిరారు. దీంతో రాహుల్ తో పాటుగా ఇండియా కూటమి ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు.

Also Read : ఢిల్లీలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. సీమాపురిలో టెన్షన్!

ఇక జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టేందుకు ఇండియా కూటమి నేతలు ప్రయత్నించారు. అయితే ముందుగా అనుమతి తీసుకోలేదని పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌లో వ్యూహాత్మక సమావేశం తర్వాత ఎంపీలు జంతర్ మంతర్‌కు బయలుదేరగా పోలీసులు వారిని మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. మంగళవారం ఢిల్లీలో రాహుల్ గాంధీ ధర్నా, ఆ తర్వాత నేతల అరెస్టులతో హైడ్రామా నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపుతో ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు ఢిల్లీలోని జన్‌పథ్‌లో ఉన్న సాగర్ రత్న రెస్టారెంట్‌లో సమావేశమయ్యారు. ఓట్ చోరీ అంశంపై మరింత గట్టిగా పోరాటం చేయడంతో పాటు, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు తదుపరి కార్యాచరణపై చర్చించారు.

Also Read : ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. హిందూ సంప్రదాయంలో పెళ్లి.. ఆ తర్వాత షాకింగ్ ట్విస్ట్

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.