
Rahul Gandhi : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు ఆరోపణలు చేశారు. దేశంలో ఓట్ల చోరీ జరుగుతోందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై రాహుల్ గాంధీ మాట్లాడారు.
మోదీ ప్రభుత్వంలో పనిచేస్తున్న దాదాపు 200 మంది అధికారులు ప్రతిపక్ష నేతలతో టచ్లో ఉన్నారని ఆయన చెప్పారు. వీరిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ , విదేశాంగ శాఖకు చెందిన అధికారులు కూడా ఉన్నారని వెల్లడించారు.
మోదీజీ.. మీ ప్రభుత్వంలో ఉన్న 200 మంది అధికారులు మాతో టచ్లో ఉన్నారు. వారు మాకు సమాచారం అందిస్తున్నారు అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అయితే, ఆ అధికారుల పేర్లను కానీ, వారు ఏ రకమైన సమాచారం ఇస్తున్నారనే వివరాలను కానీ ఆయన బయటపెట్టలేదు.
మరోవైపు, ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఇండియా కూటమి త్వరలో ఢిల్లీలోని కేంద్ర ప్రాంతానికి ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా యువత చేపడుతున్న నిరసనలపైనా రాహుల్ గాంధీ పరోక్షంగా స్పందించారు. కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలోని యువ నిరసనకారులను ఉద్దేశించి మాట్లాడినట్లు తెలుస్తోంది. అన్ని నిరసనలు ఒకటేనని, వాటి మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం, ఎన్నికల సంఘంపై ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్న వేళ రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.









