
వర్షా కాలం వచ్చిందంటే చాలు.. వేడివేడిగా బజ్జీలు, పకోడీలు, సమోసాలు తినాలని ఎవరికైనా అనిపిస్తుంది. అయితే ఈ సీజన్ ఎంత ఎంజాయ్‌గా ఉంటుందో అన్నే అనారోగ్య సమస్యలు వస్తాయి. వానాకాలంలో బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్ వంటివి చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయి. దీనివల్ల మన రోగనిరోధక శక్తి తగ్గి, జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. అందుకే ఈ సీజన్లో మనం తినే కొన్ని ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ వానాకాలంలో అస్సలు తినకూడని ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
రోడ్ సైడ్ దొరికే స్ట్రీట్ ఫుడ్స్
చల్లటి వాన పడుతుంటే రోడ్డు పక్కన వేడివేడిగా తినుబండారాలు తినడం చాలా మందికి అలవాటు. కానీ ఈ సీజన్లో బయట దొరికే పానీపూరి, చాట్, కట్ ఫ్రూట్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి. రోడ్డు పక్కన వాడే నీరు ఎంతవరకు శుభ్రంగా ఉందో మనకు తెలియదు. ఈ నీటి ద్వారా టైఫాయిడ్, కలరా, జాండిస్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వ్యాపిస్తాయి. అలాగే ఈ ఈగలు వాలిన ఆహారాన్ని తినడం వల్ల విరేచనాలు, వాంతులు అయ్యే ప్రమాదం ఉంది.
ఆకుకూరలు
ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచివని మనకు తెలుసు. కానీ, వర్ష కాలంలో వీటికి కొంచెం బ్రేక్ ఇవ్వడం మంచిది. ఎందుకంటే, వానల వల్ల ఆకుకూరల పొలాల్లో బురద, మురికి నీరు చేరుతుంది. ఆకుల వెనుక భాగంలో చిన్న చిన్న పురుగులు, వాటి గుడ్లు, కంటికి కనిపించని బ్యాక్టీరియా చేరిపోతాయి. వీటిని మనం ఎంత కడిగినా కొన్నిసార్లు పోవు. ఒకవేళ తినాలనుకుంటే.. ఉప్పు, పసుపు వేసిన వేడి నీళ్లలో బాగా కడిగి, పూర్తిగా ఉడికించిన తర్వాతే తినాలి.
సీ ఫుడ్స్
రెయినీ సీజన్ అనేది చేపలు, రొయ్యలు గుడ్లు పెడతాయి. అందువల్ల ఈ సీజన్లో దొరికే సీ ఫుడ్ అంత ఫ్రష్‌గా ఉండదు. పైగా నీరు కలుషితం కావడం వల్ల చేపల పొట్టలో బ్యాక్టీరియా ఎక్కువగా చేరుతుంది. ఈ సమయంలో తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది.
మసాలాలు, పకోడీలు, వేపుళ్లు
వర్షం పడగానే కిచెన్‌లోకి వెళ్లి బజ్జీలు వేసేసుకుంటాం. కానీ వానాకాలంలో జీర్ణక్రియ చాలా తగ్గుతుంది. ఇలాంటి సమయంలో ఎక్కువ నూనె ఉన్న ఫుడ్స్, మైదాతో చేసిన పదార్థాలు తింటే అవి త్వరగా అరగవు. గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.









