దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్(RBI) కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 0.25 శాతం పెంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఈ నిర్ణయంతో ప్రస్తుతం ఉన్న రెపో రేటు 5.5 శాతానికి చేరింది. కాగా 2023 ఫిబ్రవరి తర్వాత ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచడం మళ్లీ ఇదే తొలిసారి. అయితే సడెన్‌గా ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఓ కారణం ఉంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో తీవ్ర యుద్ధ సంక్షోభం నెలకొంది. దీనికారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తీవ్రంగా ఎగబాకుతున్నాయి. ఈ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వృద్ధిని తీవ్రంగా మందగించేలా చేసే ప్రమాదం ఉందని.. అందుకే ముందస్తు జాగ్రత్త చర్యగా ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు రేట్లు పెంచక తప్పలేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

Also Read : ఆకాశవాణి భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. రాహుల్, ప్రియాంక అరెస్ట్!

అసలు రెపో రేటు అంటే ఏమిటి?

మనకు అత్యవసరంగా డబ్బులు కావలసి వచ్చినప్పుడు ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వంటి సాధారణ వ్యాపార బ్యాంకుల వద్దకు వెళ్లి రుణాలు తీసుకుంటాం. అలాగే దేశంలోని బ్యాంకులకు అత్యవసరంగా నిధులు లేదా డబ్బు కావాల్సి వచ్చినప్పుడు అవి మన దేశ కేంద్ర బ్యాంకు అయిన ఆర్‌బీఐ వద్ద నుంచి అప్పుగా తీసుకుంటాయి. ఇలా బ్యాంకులు ఆర్‌బీఐ నుంచి తీసుకునే రుణాలపై చెల్లించాల్సిన వడ్డీ రేటునే ‘రెపో రేటు’ అని పిలుస్తారు. ఆర్‌బీఐ ఈ రెపో రేటును పెంచినప్పుడు బ్యాంకులకు ఆర్‌బీఐ ఇచ్చే రుణాలు మరింత పెరుగుతాయి. దాంతో బ్యాంకులు కూడా ఆ అదనపు భారాన్ని భరించలేక, తమ వద్ద రుణాలు తీసుకున్న సామాన్య వినియోగదారులపైకి ఆ భారాన్ని బదిలీ చేస్తాయి.

సామాన్యులపై ప్రభావం పడనుందా?

ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సమాజంలో ఉండే రెండు వర్గాల ప్రజలపై రెండు రకాల ప్రభావాలు ఉంటాయి. బ్యాంకుల వద్ద రుణాలు తీసుకున్న వారికి ఇది భారాన్ని, నష్టాన్ని కలిగిస్తే.. బ్యాంకుల్లో డబ్బులు పొదుపు చేసుకునే డిపాజిటర్లకు మాత్రం కొంతవరకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది.

రుణ గ్రహీతలకు నష్టం

ఆర్‌బీఐ రేట్లు పెంచగానే బ్యాంకులు కూడా తమ వద్ద ఉన్న సొంత వడ్డీ రేట్లను పెంచుతాయి. దీనివల్ల ఇప్పటికే లోన్లు తీసుకున్న వారి మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ లేదా ఎక్స్‌టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఫలితంగా రుణగ్రహీతలు ప్రతినెలా చెల్లించే ఈఎంఐ భారం పెరుగుతుంది. ఒకవేళ ఈఎంఐ మొత్తం పెరగకపోతే, లోన్ తీర్చే కాలపరిమితి పెరుగుతుంది.

డిపాజిటర్లకు లాభం

రుణాలపై వడ్డీ పెంచినట్లే బ్యాంకులు తమ వద్ద ఉండే పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేట్లను కూడా పెంచుతాయి. దీనివల్ల బ్యాంకుల్లో డబ్బులు దాచుకునే సామాన్యులకు, ముఖ్యంగా వడ్డీ ఆదాయంపైనే ఆధారపడే సీనియర్ సిటిజన్లకు మునుపటి కంటే ఎక్కువ వడ్డీ ఆదాయం లభిస్తుంది.

Also Read : ఆఫీసర్‌నంటూ AAP నేతకు వల.. పెళ్లి తర్వాత నగలతో పరార్‌!

ఏ ఏ రుణాలపై వడ్డీ భారం ఎక్కువగా పడుతుంది?

ఆర్‌బీఐ రెపో రేటును పెంచిన వెంటనే వాణిజ్య బ్యాంకులు తమ రుణాలపై వడ్డీ రేట్లను వేగంగా సవరిస్తాయి. దీని ప్రభావం కొన్ని రుణాలపై పడుతుంది. గృహ రుణాలపై మారే వడ్డీ రేట్ల ప్రాతిపదికన ఉంటాయి. అందుకే ఆర్‌బీఐ నిర్ణయం ప్రభావం చాలా త్వరగా హోమ్ లోన్లపై పడుతుంది. ఉదాహరణకు రూ.10 లక్షల ఇంటికి లోన్ తీసుకున్న వారికి కూడా ప్రతీ నెలా చెల్లించే ఈఎంఐ పెరుగుతుంది. అదే వెహికల్స్ అయితే కొత్తగా వాహనాలు లేదా పర్సనల్ లోన్లు తీసుకోవాలనుకునే వారికి వడ్డీ రేట్లు మునుపటి కంటే భారం అవుతాయి. పాత రుణాలు ఉన్నవారికీ నిబంధనలను బట్టి వడ్డీ రేటు పెరిగే అవకాశం ఉంటుంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తమ వ్యాపారాల కోసం తీసుకునే రుణాల వడ్డీ రేట్లు కూడా పెరగడం వల్ల వారి వ్యాపార నిర్వహణ ఖర్చులు పెరిగిపోతాయి.