China : భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్‌పై చైనా మరోసారి కన్నేసిందా? సరిహద్దుల్లో వివాదం ఉన్న ప్రాంతాల్లో చైనా సైన్యం మెల్లమెల్లగా తన ఉనికిని పెంచుకుంటోందనే ఆరోపణలు వస్తున్నాయి. 2022 నాటి ఉపగ్రహ చిత్రాలతో పాటు తాజా చిత్రాలను పరిశీలించిన బ్రిటన్‌కు చెందిన ‘ది ఇండిపెండెంట్’ వార్తా సంస్థ.. ఈ ప్రాంతాల్లో చైనా కొత్త నిర్మాణాలు చేపడుతున్నట్లు ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ముఖ్యంగా అరుణాచల్‌ప్రదేశ్‌లోని అప్పర్‌ సుభాన్‌సిరి లోయ, జరి, లుంగే ప్రాంతాల్లో కొత్త భవనాలు, రహదారులు వంటి నిర్మాణాలు కనిపిస్తున్నాయని ఆ కథనం పేర్కొంది. పాత ఉపగ్రహ చిత్రాలతో పోలిస్తే ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో నిర్మాణాలు పెరిగినట్లు తెలుస్తోందని తెలిపింది.

చైనా సైన్యం ఒక్కసారిగా పెద్ద ఎత్తున ముందుకు రాకుండా.. కొద్దికొద్దిగా తన ఉనికిని పెంచుకుంటోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విధానాన్నే ‘సలామీ స్లైసింగ్‌’ వ్యూహంగా పిలుస్తారు. అంటే ఒకేసారి పెద్ద ప్రాంతాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించకుండా.. దశలవారీగా చిన్నచిన్న మార్పులు చేస్తూ అక్కడ తమ ఉనికిని బలపరచుకోవడం.

సరిహద్దు ప్రాంతాల్లో నివసించే గిరిజనులు కూడా చైనా సైన్యం తమ కార్యకలాపాలకు అడ్డంకులు కల్పిస్తోందని చెబుతున్నట్లు ‘ది ఇండిపెండెంట్’ వెల్లడించింది. తాము వేటకు వెళ్లే ప్రాంతాలు, పశువులను మేపుకునే ప్రాంతాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని వారు ఆరోపించినట్లు పేర్కొంది. ముఖ్యంగా జూన్‌ నుంచి ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోందని స్థానికులు చెప్పినట్లు తెలిపింది.

అయితే అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా చొరబాట్లకు సంబంధించి గతంలోనూ ఇలాంటి వార్తలు వచ్చాయి. వాటిలో కొన్ని ఆరోపణలను భారత సైన్యం ఖండించింది. సరిహద్దు పరిస్థితిని భద్రతా బలగాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని, చైనా కదలికలపై కూడా నిఘా ఉందని అధికారులు పలుమార్లు స్పష్టం చేశారు.

మరోవైపు సరిహద్దు ప్రాంతాల్లో భారత్‌ కూడా రహదారులు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేస్తోంది. దీంతో భారత్‌-చైనా సరిహద్దుల్లో రెండు దేశాల మధ్య మౌలిక సదుపాయాల పోటీ కూడా కొనసాగుతోంది.

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ భారత్‌లో జరిగే బ్రిక్స్‌ సదస్సుకు హాజరయ్యే సమయంలో ఈ నివేదిక వెలుగులోకి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సరిహద్దు వివాదం ఇప్పటికే రెండు దేశాల సంబంధాల్లో కీలక అంశంగా కొనసాగుతున్న నేపథ్యంలో.. అరుణాచల్‌ప్రదేశ్‌లో తాజా పరిణామాలు మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.