
ప్రముఖ పర్యావరణవేత్త, సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ నీట్ పరీక్షల్లో జరిగిన పేపర్ లీకేజీ అక్రమాలకు నిరసనగా నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోనమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వస్తేనే తాను దీక్ష విరమిస్తానని, లేకపోతే ప్రాణాలైనా అర్పిస్తానని లేఖలో తెలిపారు.
Activist Sonam Wangchuk writes a letter to Union Ministers JP Nadda and Jitendra Singh
The letter reads, "Thank you for visiting me at the hospital last night and for your earnest appeal that I end my fast. During our discussion, you assured me that the Government would… pic.twitter.com/GGdJXYPfkF
— ANI (@ANI) July 22, 2026
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కొందరు కేంద్ర మంత్రులు తనను పరామర్శించి దీక్ష విరమించాలని కోరినట్లు సోనమ్ వాంగ్‌చుక్ లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా నీట్ పేపర్ లీకేజీ అక్రమాల కారణంగా తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని కోరారు. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాతో పాటు ఈ వ్యవహారంపై పార్లమెంట్‌లో చర్చ జరిపి బాధ్యులను చట్టం ముందు నిలబెట్టడం వంటి డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని మంత్రులు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
ఇటీవల నిర్వహించిన ఛలో సంసద్ నిరసన గురించి ఆ లేఖలో ప్రస్తావించారు. పోలీసులు బలప్రయోగం చేసినప్పటికీ విద్యార్థులు ఎంతో సహనంతో, ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించారన్నారు. ఈ పోరాటంలో పాల్గొన్న యువ నిరసనకారులు, విద్యార్థులపై ఎలాంటి అక్రమ కేసులు పెట్టకూడదన్నారు. అలాగే వారిపై ఎలాంటి ప్రతీకార చర్యలు లేదా పోలీసు వేధింపులు ఉండకూడదని, ప్రభుత్వం నుంచి హామీ కావాలని డిమాండ్ చేశారు.
తన ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సుమారు 65 మంది పార్లమెంట్ సభ్యులు తనకు లేఖలు రాశారన్నారు. అలాగే కొందరు తనను కలిసినట్లు తెలిపారు. నేను జీవించాలనుకుంటున్నాను.. మళ్లీ నా విద్యార్థుల మధ్యకు వెళ్లాలని ఆశపడుతున్నాను. కానీ.. ఈ పోరాటానికి మూలకారకులైన లక్షలాది మంది యువత ప్రయోజనాలను, భవిష్యత్తును వదిలేసి దీక్షను మధ్యలోనే వదిలేయనని సోనమ్ లేఖలో తెలిపారు. ప్రభుత్వం స్పందిస్తే నిరాహార దీక్ష వదిలేస్తానని.. లేకపోతే కొనసాగిస్తానని తెలిపారు. విద్యార్థుల నిరసనలను అణచివేసేందుకు పోలీసుల బలప్రయోగాన్ని ఇకపై ఉపయోగించరని అనుకుంటున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.









