
IIT Delhi : ఐఐటీ ఢిల్లీలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంఎస్సీ ఫిజిక్స్ విద్యార్థి రిషికేష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడటం సంచలనానికి దారి తీసింది. ఈ ఘటన క్యాంపస్‌లో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. విద్యార్థి మృతికి కారణమైన విషయాలపై విచారణ జరిపి న్యాయం చేయాలని, అధికారుల నిర్లక్ష్యంపై జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో క్యాంపస్‌లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చటంతో క్యాంపస్ వాతావరణానికి భగ్నం కలిగిస్తే కఠిన క్రమశిక్షణా చర్యలు తప్పవని ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ రంగన్ బెనర్జీ విద్యార్థులను గట్టిగా హెచ్చరించడం మరింత వివాదానికి కారణమైంది. ఈ మేరకు విద్యార్థులకు పంపిన అధికారిక ఈ-మెయిల్లో ఆయన తీవ్రంగా స్పందించారు.. గురువారం (ఆగస్టు 27) రాత్రి సమయంలో క్యాంపస్ లో పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా మారాయని ఆయన పేర్కొన్నారు.
Also Read : ముగిసిన వివాదం.. బాబా రాందేవ్, కంగనా రనౌత్ మధ్య కుదిరిన సయోధ్య!
రాత్రి 10:30 గంటల నుంచి అర్ధరాత్రి 12:30 గంటల వరకు ఆందోళనకారులు తమ ఆందోళనను మరింత విస్తరిస్తున్నారని, నిరసనలను క్యాంపస్‌లోని రెసిడెన్షియల్ ప్రాంతాలకు విస్తరించి, ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీ నివాసాల ముందు భారీ ఎత్తున ధర్నాలకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు. విద్యార్థుల చర్యను డైరెక్టర్ తీవ్రంగా ఆక్షేపించారు. ఆందోళన పేరుతో విద్యార్థులు నివాస ప్రాంతాలు, తరగతి గదులు, ఇతర విద్యా సంబంధిత కార్యకలాపాలకు అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. ఇలాంటి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై సంస్థ నిబంధనల ప్రకారం చట్టపరమైన, క్రమశిక్షణా చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అయితే యాజమాన్యం తీరుపై విద్యార్థి సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో క్యాంపస్‌లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Also Read : మేం కూడా మీ చెల్లెళ్లమే.. కశ్మీర్లో అపూరూప దృశ్యం!









