మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో వరద పరిస్థితి గంటగంటకూ తీవ్రరూపం దాల్చుతుండటంతో భారత వాతావరణ శాఖ (IMD) ముంబై, థానే, రాయ్‌గఢ్ జిల్లాలకు జారీ చేసిన ముందస్తు ఆరెంజ్ అలర్ట్‌ను అత్యంత ప్రమాదకరమైన ‘రెడ్ అలర్ట్’గా మారుస్తూ తాజా హెచ్చరికలు జారీ చేసింది. రానున్న గంటల్లో ఈ జిల్లాలతో పాటు నవీ ముంబై, పాల్ఘర్ ప్రాంతాలలో గంటకు 80 నుండి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తూ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.

ఎడతెరిపిలేని వానల కారణంగా పుణె-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే, ఓల్డ్‌ ముంబయి-పుణె హైవేలపై పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.దీంతో ఈ ప్రధాన మార్గాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ రహదారులపై అన్ని రకాల వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేసినట్లు మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MSRDC) ప్రకటించింది. త

దుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రయాణికులు ఎవరూ ఈ మార్గాల వైపు రావొద్దని, ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అడ్వైజరీలను గమనించుకోవాలని సూచించింది.

రోడ్డు మార్గాలతో పాటు ముంబై లైఫ్ లైన్ అయిన రైల్వే నెట్‌వర్క్, విమాన రాకపోకలపై కూడా వర్ష ప్రభావం తీవ్రంగా పడింది. పట్టాలపై నీరు చేరడంతో సోమవారం నడవాల్సిన 16 కీలక రైలు సర్వీసులను అధికారులు పూర్తిగా రద్దు చేశారు. అటు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లకు వాతావరణం సహకరించకపోవడంతో పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి, కొన్నింటిని దారి మళ్లించారు. వర్ష తీవ్రత దృష్ట్యా ముంబై, పరిసర జిల్లాల్లోని పాఠశాలలు, విద్యాసంస్థలకు ప్రభుత్వం సోమవారం అత్యవసర సెలవు ప్రకటించింది.

Also Read : అఖిలేష్ యాదవ్ ముందే పుష్-అప్స్.. వైరల్ గా మారిన వీడియో..ఇంతకు ఎవరీతను?

ముంబైలోని మన్‌కుర్ద్‌ ప్రాంతంలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఒక పాత నివాస భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు చిన్నారులతో సహా మొత్తం ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాలను తొలగించే పనులను చేపట్టాయి. పాత భవనాలు దెబ్బతినడం, భారీ వృక్షాలు నేలకూలడం మరియు ఆకస్మిక వరదలు (Flash Floods) పొంచి ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మహారాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (SDMA) అప్రమత్తమై పలు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ముంబై పరిధిలోని ప్రైవేట్ సంస్థలు, ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వీలైనంత వరకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (ఇంటి నుంచే పనిచేసే) సదుపాయం కల్పించాలని సూచించింది. అంతేకాకుండా, అత్యవసర విభాగాలు (పోలీస్, మున్సిపల్, వైద్యం) మినహా ఇతర ప్రభుత్వ, సెమీ-ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యాహ్నం తర్వాత ప్రభుత్వం హాఫ్-డే (సెలవు) ప్రకటించి, సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని ఆదేశించింది.

రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మంత్రి గిరీష్ మహాజన్ ప్రస్తుత పరిస్థితిపై స్పందిస్తూ.. ప్రజలెవరూ అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఈ వారాంతంలో జలపాతాలు, ఘాట్ రోడ్లకు విహారయాత్రల (టూరిజం) కోసం వెళ్లడాన్ని పూర్తిగా నిషేధించామన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసుల ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైవేలపై కొండచరియలు విరిగిపడిన ఘటనలపై ప్రతిపక్షాలు రాజకీయం చేయవద్దని, ఈ విపత్కర పరిస్థితుల్లో అందరూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కాగా, రాష్ట్రంలోని ప్రాజెక్టులు, డ్యామ్‌లలో నీటి మట్టాలు ఆశాజనకంగా పెరగడానికి మరో మూడు నాలుగు రోజుల పాటు ఇలాగే వర్షాలు కురవాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు.

Also Read : పచ్చని పందిట్లో ‘వధూ’ రూపంలో కాలనాగు.. ప్రియుడితో కలసి నవవరుడి దారణహత్య

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.