
Uddhav Thackeray : అయోధ్య రామాలయ విరాళాల చోరీ వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్ర మోదీపై శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ ఠాక్రే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముంబైలోని దాదర్‌లో నిర్వహించిన ‘రామరక్ష’ ఆందోళనలో పాల్గొన్న ఆయన, తన మద్దతుదారులతో కలిసి హనుమాన్ స్తోత్రం, హనుమాన్ చాలీసా, రామరక్ష స్తోత్రాలను పఠించారు. హిందువులను దోచుకునేవారే ఇప్పుడు అధికారంలో ఉండటం అత్యంత దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “ఓ దోపిడీదారుడిని అతని దోపిడీపై దర్యాప్తు చేసుకోమని ఎలా చెబుతారు?” అంటూ కేంద్ర దర్యాప్తు సంస్థల తీరును ఆయన నర్మగర్భంగా ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. “అయోధ్య అనేది కేవలం ఒక ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది. కాశీ, మథుర ఆలయాలను కూడా కడతాం అని కొందరు పెద్దలు చెబుతున్నారు. కానీ, సాక్షాత్తూ అయోధ్యలోనే ఇంత పెద్ద ఎత్తున విరాళాల దోపిడీ జరిగితే.. రేపు కాశీ, మథురలో జరిగే దోపిడీల పరిస్థితి ఏంటి? అక్కడ జరిగే లూటీ గురించి తలుచుకుంటేనే నాకు భయమేస్తోంది” అని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. హిందుత్వను దుర్వినియోగం చేసి ఆలయాన్ని ఎవరైనా దోచుకుంటే దేశంలోని హిందువులు ఎంతమాత్రం క్షమించబోరని, మనకు ‘బీజేపీ రహిత రాముడు’, స్వచ్ఛమైన హిందుత్వం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ వివాదంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS), విశ్వహిందూ పరిషత్ (VHP) కూడా రంగంలోకి దిగాయి. అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ ఆరోపణల కేసులో విచారణ నిష్పాక్షికంగా జరగాలని, దోషులుగా తేలిన వారికి కఠిన శిక్షలు విధించాలన్న ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే వ్యాఖ్యలతో తాము పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు సంస్థ సర్సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ నాగ్‌పూర్‌లో స్పష్టం చేశారు. మరోవైపు, కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న రూ. 20,000 కోట్ల అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు ఆలోక్‌కుమార్ అయోధ్య పోలీసులకు లేఖ రాశారు. ఒకవేళ విపక్షాలు విద్వేషాలు రెచ్చగొట్టేందుకే ఈ తప్పుడు ఆరోపణలు చేసినట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Also Read : ఒక సినిమా.. మూడు పేర్లు.. నాలుగేళ్ల సెన్సార్ యుద్ధం: ఓటీటీలోకి వచ్చిన 48 గంటల్లోనే మాయం.. అసలేం జరిగింది?
ఈ కుంభకోణంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ ఇప్పుడు ‘ఓట్ చోరీ, సీట్ చోరీ, చందా చోరీ’ అనే త్రిముఖ వ్యూహాన్ని అమలు చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆరోపించారు. రామాలయ ప్రారంభోత్సవ క్రెడిట్ అంతా తమ ఖాతాలో వేసుకున్న ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా.. ఇప్పుడు జరుగుతున్న విరాళాల లూటీపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఇదంతా బీజేపీ-ఆరెస్సెస్ సంయుక్తంగా చేసిన స్కామ్ అని, దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. రామాలయ సొమ్ము లూటీకి బీజేపీ, ఆరెస్సెస్ సంయుక్తంగా బాధ్యత వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారంలో పారదర్శకత లోపించిందంటూ సీపీఎం రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిటాస్ సరికొత్త చర్చకు తెరలేపారు. శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టును సమాచార హక్కు చట్టం (RTI) పరిధిలోకి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నిస్తూ ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఈ నిర్ణయాన్ని కేంద్రం వెంటనే పునఃసమీక్షించుకోవాలని కోరారు. కాగా, సోమవారం అయోధ్య ఆలయ ట్రస్ట్ అత్యవసర సమావేశం జరగనున్న నేపథ్యంలో.. రోజువారీ విరాళాల సేకరణ లేదా లెక్కింపు ప్రక్రియలో తనకు ఎలాంటి పాత్ర లేదని ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి ముందే స్పష్టం చేయడం గమనార్హం. ఇదే సమయంలో, కేసులో అరెస్టయిన నిందితుడు టిన్నూ యాదవ్ భార్య పూనమ్ మాట్లాడుతూ.. ఆలయంలోని కొందరు ప్రముఖులను, పెద్ద తలకాయలను రక్షించడం కోసమే తన భర్తను బలపశువును చేసి ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు.
రామాలయ విరాళాల వివాదం ముదురుతున్న వేళ, ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ‘బద్రీనాథ్ ధామ్’ కూడా వార్తల్లోకిెక్కింది. బద్రీనాథ్‌కు భక్తులిచ్చిన విరాళాలలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరిపేందుకు ‘బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ’ నలుగురు సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని నియమించింది. వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని సీఈఓ సోహన్‌సింగ్ ఆదేశించారు. ఈ పరిణామాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ లఖ్‌నవూలో స్పందిస్తూ.. విపక్షాలకు మొదటి నుండి హిందూ విశ్వాసాలను అవమానించే చరిత్రే ఉందని మండిపడ్డారు. రామమందిర ఉద్యమాన్ని మొదటినుంచీ వ్యతిరేకిస్తూ వచ్చిన కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు ఇప్పుడు కుట్రలు చేస్తున్నాయని, భక్తుల విశ్వాసాన్ని కాపాడటం కోసం తాము రక్తం చిందించడానికైనా వెనుకాడబోమని హెచ్చరించారు.
Also Read : ముంబైలో భారీ వర్షం.. 4 విమానాలు రద్దు, 13 దారి మళ్లింపు









