

Ravi Prakash
ఒక్కసారి ఊహించండి… 15 ఏళ్ల అమ్మాయికి… ఎవరో గుర్తుతెలియని వ్యక్తి.. వేర్వేరు ఫోన్ నంబర్ల నుంచి పదేపదే కాల్స్ చేస్తున్నాడు. కాల్ చేసిన వ్యక్తి…నిన్ను రేప్ చేస్తాం…నిన్ను చంపేస్తాం…నీ శవాన్ని డ్రైనేజ్‌లో పడేస్తాం… అని బెదిరిస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి..బెదిరింపులకు గురైన ఈ యువతి
ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఓ నిరసనలో పాల్గొంది. అదే ఆమె చేసిన అతిపెద్ద తప్పు. ఇప్పుడు ఆ అమ్మాయిని టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలో బహిరంగంగా వేలానికి పెట్టారు.
చెప్పలేని రీతిలో పోస్టులు పెట్టారు. కామెంట్లలో… నీ రేటు 200.. 300… అంటూ నీచానికి దిగజారారు. ఆమె గౌరవాన్ని సోషల్ మీడియా వేదికగా బజారుకీడ్చారు. ఇక్కడే మరో చిన్నారి ఇష్యూ..ఓ అబ్బాయిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. గంటల తరబడి ప్రశ్నించారు… భయపెట్టారు..అదే సమయంలో ఇంటర్నెట్లో పెద్ద రచ్చ. ఆ పిల్లోడు నేరస్థుడు అని సోషల్ మీడియాలో తీర్పు వచ్చేసింది. అయితే తెరవెనుక జరిగిన కుట్ర ఏంటో మీకు తెలియాలంటే.. ఇప్పుడు నేను చెప్పబోయే రిపోర్ట్‌ను పూర్తిగా చూడండి.
ఇది ఒక అమ్మాయి కథ కాదు.. ఇది ఒక నిరసన కథ కూడా కాదు..నిరసన ముగిసిన తర్వాత…
ఏం జరిగిందనేదే ఈ కథ.. ఇటీవల జంతర్ మంతర్.. నిరసన వీడియోలు వైరల్ అయినప్పటినుంచి…
ఆ ప్రొటెస్ట్‌లో పాల్గొన్న చాలామంది యువతీ యువకులు… సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు తీవ్ర అవమానాలు ఎదుర్కొంటున్నారు. వారిని ఓ వర్గం టార్గెట్ చేసింది. వారి వ్యక్తిగత సమాచారాన్ని బయట పెట్టింది…చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.. వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు పెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసులు నుంచి కూడా ఇబ్బందులు ఎదురయ్యాయని బాధితులు వాపోతున్నారు.
నేను విద్యార్థుల దుర్భాషను సమర్థించడంలేదు. ఏ రాజకీయ పార్టీని కొమ్ముకాసేందుకు నేను ఈ వీడియో చేయడం లేదు. దేశవ్యాప్త చర్చలో సెంటర్ పాయింట్‌గా మారిన యువతీయువకుల జీవితాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? ,అసలు ఏం జరిగిందో తెలుసుకోవడమే నా ఉద్దేశం.. అందుకే ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా.
మొదటగా రుచికా సింగ్ కేసును చూద్దాం. ఆ పాప వయస్సు 15 ఏళ్లు. ప్రధానిని రుచిక తిట్టిన వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. తదనంతరం ఆగమేఘాలపై FIR కూడా నమోదైంది. ఆ తర్వాత రుచిక క్షమాపణ చెప్పింది. తాను మాట్లాడింది తప్పని కూడా ఒప్పుకుంది. కానీ…రుచిక కష్టాలు సారీ చెప్పడంతో ముగిసిపోలేదు. క్షమాపణ చెప్పిన తర్వాత కూడా వదల్లేదు.
ఈ ఇంటర్వ్యూలో… గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని రుచిక చెప్తోంది. రేప్ చేస్తాం…చంపేస్తామంటూ బెదిరించారని రుచిక అంటోంది. అంతేకాదు… పిల్లలను క్షమించాలని ప్రధానమంత్రి బహిరంగంగా చెప్పిన తర్వాత కూడా… తనపై పోలీసుల వేధింపులు ఇంకా కొనసాగుతున్నాయని కూడా ఆరోపిస్తోంది. ఇక్కడో క్లారిటీ ఇస్తున్నా. ఇవన్నీ రుచిక చేసిన ఆరోపణలు. మేం చెప్తున్న విషయాలు కావు.
కానీ… ఈ ఆరోపణల కథ రుచికతో ఆగిపోలేదు. ఇక్కడే… ఈ స్టోరీకి బిగ్ ట్విస్ట్. మరో అమ్మాయి ఎంట్రీతో ఇష్యూ మరింత హీటెక్కింది. ఎందుకంటే… ఇప్పుడు మనం చూడబోయే యువతి… ప్రధానమంత్రిని ఎప్పుడూ దూషించలేదు. ఎక్కడా అసభ్యంగా ప్రవర్తించలేదు. అయినా… ఈరోజు…ఇంటి నుంచి బయటకు రావాలంటేనే… భయం భయంగా ఉందని ఆమె చెబుతోంది.
ఈమె శ్రద్ధా సింగ్.. 23 ఏళ్ల యోగా ఇన్స్ట్రక్టర్, కంటెంట్ క్రియేటర్..మధ్యప్రదేశ్ అమ్మాయి. జంతర్ మంతర్ నిరసనలో పాల్గొనడానికి ఢిల్లీ వచ్చింది. దేశంలోని వేలాది మంది యువతలాగే… తన గొంతు వినిపించే హక్కు ఉందని నమ్మింది. ఆ నిరసన సమయంలో, కనాట్ ప్లేస్ దగ్గర ఉన్న
ఇద్దరు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందితో కలిసి 7 సెకండ్ల ఇన్స్టాగ్రామ్ రీల్ రికార్డ్ చేసింది.
దాన్ని పోస్ట్ చేసి తన పనిలో పడిపోయింది. కానీ… ఆ 7 సెకండ్ల రీల్ తన జీవితాన్నే మార్చేస్తుందని శ్రద్ధ ఊహించలేదు.
‘స్క్రోల్’ ప్రచురించిన రిపోర్ట్ ప్రకారం…ఆ రీల్‌ను కొన్ని సోషల్ మీడియా పేజీలు షేర్ చేశాయి. శ్రద్ధా భద్రతా బలగాలను అవమానించిందని చెప్తూ కొన్ని క్యాప్షన్లు పుట్టుకొచ్చాయి. కానీ, ఆ వీడియోలో అసభ్యంగా మాట్లాడలేదని శ్రద్ధ స్పష్టం చేస్తోంది. ఆ రీల్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయి…
చివరికి టీవీ స్టూడియోలకు చేరిపోయింది. శ్రద్ధ ఇష్యూలో ఆ తర్వాత జరిగింది చాలా బాధాకరం. శ్రద్ధ ఇన్స్టాగ్రామ్ పోస్టుల్లో ఉన్న కారు నంబర్ ప్లేట్ ఆధారంగా… ఆమె ఫోన్ నంబర్, ఇంటి అడ్రస్‌లను కొంతమంది బయటపెట్టారు. దీంతో వెంటనే బెదిరింపులు మొదలయ్యాయి.
ఓ ఇంటర్వ్యూలో శ్రద్ధ మాట్లాడుతూ… తనను చంపేస్తామని, రేప్ చేస్తామని బెదిరిస్తున్నారని చెప్పింది.
తన తల్లి, ఫ్రెండ్స్ సోషల్ మీడియా అకౌంట్లను కూడా టార్గెట్ చేశారని శ్రద్ధ ఆరోపించింది. ఇంతకీ శ్రద్ధ ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే విందాం.
శ్రద్ధ మరో దారుణమైన విషయం చెప్పింది. ఆమె సాధారణంగా పెట్టే వీడియోల కింద కూడా
అసభ్య కామెంట్లు పెడుతున్నారని బాధపడింది. రూ.200, రూ.300 అంటూ తనకు “రేటు” కడుతూ…
దిగజార్చి మాట్లాడి తనను కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తంచేసింది. ఈ క్రమంలోనే శ్రద్ధ ఒక క్వశ్చన్ రైజ్ చేసింది. “క్యా ప్రధాన్ మంత్రి జీ కో యే సబ్ నహీ దిఖ్తా? క్యా వో కుచ్ నహీ కరేంగే?”
అంటే ఇంతా జరుగుతున్నా ప్రధానికి కనిపించడం లేదా? చర్యలు ఏమీ తీసుకోరా? అని గళమెత్తింది.
ఈ ప్రశ్న అడిగింది శ్రద్ధా సింగ్. కానీ, బాధితురాలు శ్రద్ధ ఒక్కతే కాదు. ‘స్క్రోల్’ రిపోర్ట్ ప్రకారం…
నిరసనల్లో పాల్గొన్న చాలామంది యువతుల ఫొటోలు, అకౌంట్లు, వ్యక్తిగత వివరాలు, వారి కుటుంబాల సమాచారం ఆన్లైన్లో వైరల్ చేశారు. అలాంటి వారిలో రుచికా సింగ్ ఒకరు. రుచికను టార్గెట్ చేస్తూ…ఆమె ఫొటోతో AI ఉపయోగించి “మోస్ట్ వాంటెడ్” పోస్టర్ తయారు చేశారు.
రుచిక అడ్రస్, ఫోన్ నంబర్, ఫ్యామిలీ మెంబర్స్ వివరాలు ఆన్లైన్లో షేర్ చేశారు.
ఈ అమ్మాయిల వాదనతో మీరు ఏకీభవించినా… విభేదించినా…ఇంకా ఒక ప్రశ్న మాత్రం అలాగే మిగిలి ఉంటుంది..రాజకీయ విభేదాలు, వ్యక్తిగత కక్ష సాధింపుగా మారితే… గీత ఎక్కడ గీయాలి? విమర్శ ప్రజాస్వామ్యంలో భాగం…భయపెట్టడం, ఆన్లైన్ వేధింపులు, బెదిరింపులు అప్రజాస్వామికం.
ఈ సోషల్ మీడియా వేధింపులు, నిరసనకారుల నిజ జీవితాల్లోకి ఎలాంటి తుఫాను తీసుకొచ్చాయో ఇప్పుడు చూద్దాం.
ఇది ఒక అమ్మాయి కథ కాదు. ఒక నిరసన వివాదం అంతకంటే కాదు. ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా పోస్టులు, మీడియా కథనాలు చూస్తుంటే… ఒకే తరహా దారుణమైన పరిస్థితి కనిపిస్తోంది. నిరసనలో పాల్గొన్న యువతను విమర్శించడమే కాదు… వారి వివరాలు సేకరించి, ప్లాన్ ప్రకారం టార్గెట్ చేశారు.
Also Read : చిన్నారులను టార్గెట్ చేస్తున్న సైలెంట్ కిల్లర్.. గుజరాత్‌ను గజగజలాడిస్తున్న చండీపురా వైరస్
రుచికా సింగ్ ఫొటోతో తయారు చేసిన ఈ AI “మోస్ట్ వాంటెడ్” పోస్టర్ నెట్లో తెగ వైరల్ అయింది.
రుచిక ఫ్యామిలీ వివరాలు, పని చేసే ఆఫీస్ అడ్రస్ వంటి వ్యక్తిగత విషయాలను కావాలని పోస్ట్ చేశారు.
విమర్శ అనేది ఒకస్థాయి దాటి… వ్యక్తిగత కక్షలా మారిపోయింది.
ఇలాంటి కామెంట్లు పెట్టే వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కొందరు, లైంగికంగా వేధిస్తూ మరికొందరు కామెంట్లు పెట్టారు. ఇంకొందరైతే ఈ యువతులకు “గుణపాఠం చెప్పాలి” అని ఓపెన్‌గానే బెదిరించారు.
రాజకీయంగా వీరితో మీరు ఏకీభవించినా… విభేదించినా… ఇలాంటి నీచమైన భాషను ఎవరైనా సమర్థించగలరా?
ఈ లోపే మరో వీడియో బయటికొచ్చింది. ఒక అబ్బాయి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. విచారణ పేరుతో స్టేషన్‌కు పిలిచారని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS సెక్షన్ 179 ప్రకారం… 15 ఏళ్ల లోపు పిల్లలను విచారణ నిమిత్తం స్టేషన్‌కు రప్పించకూడదు.
కానీ ఇక్కడ చట్టం కంటే పెద్ద ప్రశ్న ఉంది.. రాజకీయ వివాదాల్లో చిక్కుకున్న చిన్నపిల్లలతో
వ్యవస్థ ఎలా వ్యవహరించాలి? అని విద్యార్థుల ఉద్యమంలో 23 రోజులు నిరాహార దీక్ష చేసిన
AISA నేత నేహా బోరా దీనిపై తీవ్రంగా స్పందించారు.
ఇవి నేహా బోరా అభిప్రాయాలు. కానీ ఇక్కడ అసలు ఆందోళన రాజకీయాల గురించి కాదు… మనుషుల ప్రాణాల గురించి.. ఒక యువతి భయంతో గడపదాటి బయటకు రాలేకపోతోంది. మరో యువతికి రేప్ బెదిరింపులు వస్తున్నాయి. ఇంకో యువతి ఇప్పటికీ పోలీసుల చుట్టూ తిరుగుతోంది. ఒక చిన్న పిల్లాడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. ఈ ఆరోపణల్లో ఎంతవరకు నిజముంది అనేది చట్టం చూసుకుంటుంది.
కానీ ఒక్కటి మాత్రం నిజం… ఈ యువత జీవితాల్లో తీవ్రమైన భయం ఆవరించింది.
ప్రశ్నించే పౌరులు భయపడే పరిస్థితి వస్తే… అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. మీరు వారితో విభేదించవచ్చు. వారు మాట్లాడిన భాష తప్పు అని విమర్శించవచ్చు. చట్టం ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోమని అడగొచ్చు. కానీ ఒక హద్దు ఉండాలి. విమర్శ బెదిరింపుగా మారినప్పుడు.. విభేదాలు వ్యక్తిగత సమాచారాన్ని రచ్చకెక్కించినప్పుడు…రాజకీయ పోరాటం రేప్ బెదిరింపుల దాకా వెళ్లినప్పుడు…
సమాజంగా మనమంతా ఒక్క క్షణం ఆలోచించాలి. మనం హద్దు దాటి ప్రవర్తిస్తున్నామా? ఎందుకంటే… ఇది ఇక ఒక్క నినాదం గురించో, ఒక ప్రొటెస్ట్ గురించో కాదు. ఒక్కసారి ఆన్లైన్లో వైరల్ అయితే… సాధారణ యువత జీవితాలు ఎలా నరకంగా మారిపోతాయో చెప్పడానికి ఇదొక చేదు నిజం!
ఒక్క క్షణం… రాజకీయాలను పక్కన పెడదాం. బీజేపీని మర్చిపోండి. కాంగ్రెస్‌ను మర్చిపోండి.
సిద్ధాంతాలను పక్కన పెట్టేయండి. ఒక్క ప్రశ్న గురించి మాత్రమే ఆలోచిద్దాం. మన ప్రజాస్వామ్యం ఎలా ఉండాలి? యువత ఉత్సాహంగా భాగమయ్యేలా ఉండాలా? లేక ప్రశ్నించాలంటేనే భయపడేలా ఉండాలా?
ఈ ఇన్వెస్టిగేషన్లో యువత బాధను చూశాం. ఒక యువతి తనకు రేప్ బెదిరింపులు వచ్చాయంటోంది.
మరో యువతి ఇంటి బయటకు రావాలంటేనే భయపడుతోంది. 15 ఏళ్ల అమ్మాయి తనపై ఆన్లైన్ వేధింపులు ఆగడం లేదని ఏడుస్తోంది. పోలీస్ స్టేషన్లో కనిపిస్తున్న పిల్లాడి వీడియో… వ్యవస్థ ప్రవర్తనపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. వీళ్లంతా వేర్వేరు వ్యక్తులు… వేర్వేరు కథలు. కానీ అందరిదీ ఒకే ఆందోళన…
మన సమాజంలో స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి పోయి… భయం వచ్చి చేరిందా?
ఇండియన్ యూత్ కాంగ్రెస్ కూడా ఇదే విషయాన్ని ఆరోపించింది. బహిరంగ హామీలు ఇచ్చినా కూడా…
నిరసన తెలిపిన యువతపై పోలీసుల వేధింపులు తగ్గలేదని విమర్శించింది. ఇవి రాజకీయ ఆరోపణలు కావచ్చు…అధికారుల వాదన వేరేలా ఉండొచ్చు. కానీ… ఈ యువత పడుతున్న భయాన్ని మాత్రం మనం కాదనలేం.
ఒక విషయం మాత్రం రాజకీయాలకు అతీతం. రాజకీయ అభిప్రాయం చెప్పినందుకు ఏ మహిళకు రేప్ బెదిరింపులు రాకూడదు. ఏ కుటుంబం వ్యక్తిగత వివరాలనూ రోడ్డున పడేయకూడదు. ప్రశ్నిస్తే భయంతో బతకాలనే పరిస్థితి ఏ చిన్నారికీ రాకూడదు. ఇలాంటి ఘోరాన్ని ఏ ప్రజాస్వామ్యమూ సమర్థించకూడదు.
ధైర్యముంటే యువత వైఖరిని నేరుగా విభేదించండి. వారితో చర్చించండి. వారిని ప్రశ్నించండి. చట్టం ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోండి. కానీ… బెదిరింపులు, వ్యక్తిగత సమాచారం బయటపెట్టడం,
అవమానించడం వంటి చర్యలకు ఎన్నటికీ ప్రజాస్వామ్యంలో చోటులేదు.
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల నిరసనకారులను “పిల్లలు” అని సంబోధిస్తూ, వారిని క్షమించాలని కోరారు.
ఆ క్షమాపణ మాటల్లోనే కాదు… చేతల్లో కూడా ఉండాలి. బెదిరింపులు ఎదుర్కొంటున్న యువతకు రక్షణ దక్కాలి. వేధింపులు వెంటనే ఆగాలి. దర్యాప్తు ఏదైనా ఉంటే చట్ట ప్రకారమే జరగాలి…భయపెట్టడాలు, అవమానాలు ఉండకూడదు. ఇవి జరిగినప్పుడే ప్రధాని మాటకు నిజమైన విలువ ఉంటుంది.
నా విన్నపం కేవలం ప్రభుత్వానికి మాత్రమే కాదు…ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి నాయకుడికి, మనందరికీ!
భాష బావుండాలని మనం కోరుకుంటే… ముందు మన రాజకీయ చర్చల స్థాయిని పెంచుకోవాలి. అది అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా… లేదా ఏ రాజకీయ వర్గమైనా సరే… మద్దతుదారులు మహిళలను దూషిస్తూ, రేప్ బెదిరింపులకు పాల్పడుతుంటే.. నాయకుడు చూస్తూ ఊరుకోకూడదు. “ఇది తప్పు” అని బహిరంగంగా ఖండించాలి.ఎందుకంటే… మార్పు మన నుంచే మొదలవ్వాలి.
ఈ వీడియో… రుచిక కోసమో, శ్రద్ధ కోసమో.. లేదా ఏ ఒక్క రాజకీయ పార్టీ మద్దతుకోసమో చేయలేదు.
నా క్వశ్చన్ క్లియర్‌గా ఉంది. ఒక యువతి నిరసన గళం వినిపించిన తర్వాత… భయం లేకుండా జీవించగలదా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే… అమ్మాయిల భవిష్యత్తును మాత్రమే కాదు…
మన దేశ ప్రజాస్వామ్య ఆరోగ్యాన్ని కూడా నిర్ణయిస్తుంది. ఎందుకంటే… ఒక దేశ గొప్పతనం
తన నాయకులను ఎలా చూసుకుంటుందనే దానికంటే… తన యువతను ఎలా చూసుకుంటుందనే దానిపైనే ఆధారపడి ఉంటుంది.
Also Read : కర్ణాటక కేబినెట్ విస్తరణ: కాంగ్రెస్‌లో వెల్లువెత్తిన అసమ్మతి జ్వాలలు.. ఎమ్మెల్యేల రాజీనామాల పర్వం









