
UPI: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా చేస్తున్నారు. కనీస అవసరాల నుంచి బంగారం, ఎలక్ట్రానిక్ ఇలా అన్ని వస్తువులను కొనుగోలు చేసినప్పుడు యూపీఐ వాడుతున్నారు. అయితే యూపీఐ చేయాలంటే తప్పకుండా ఇంటర్నెట్ ఉండాలి. ఇంటర్నెట్ సిగ్నల్ సరిగ్గా లేకపోతే పేమెంట్స్ అసలు కావు. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే హిల్ స్టేషన్స్‌కు వెళ్లే వారు పేమెంట్స్ చేసేటప్పుడు చెల్లింపులు కావడం లేదు. ఈ క్రమంలోనే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఫోన్‌లో ఇంటర్నెట్ లేకపోయినా ఈజీగా పేమెంట్స్ చేసే సదుపాయాన్ని తీసుకురానున్నట్లు తెలిపింది. అయితే ఇంటర్నెట్ ఉంటే ఎంత వరకు అయినా పేమెంట్స్ చేయవచ్చు. కానీ ఇంటర్నెట్ లేకుండా కేవలం రూ.2 వేల వరకు మాత్రమే యూపీఐ చేయవచ్చు.
Also Read : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..పోలీసు కొలువుల జాతర
ఈ కొత్త ఆఫ్‌లైన్ చెల్లింపుల వ్యవస్థ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆధారంగా ట్యాప్-టు-పే విధానంలో పనిచేస్తుంది. దీని కోసం వినియోగదారులు ముందుగా తమ ఫోన్‌లో ఇంటర్నెట్ ఉన్న సమయంలో యూపీఐ లైట్ వ్యాలెట్‌లోకి కొంత నగదును లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెట్‌వర్క్ లేని ప్రదేశాల్లో వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు మీ ఎన్ఎఫ్‌సీ ఉన్న ఫోన్‌ను వ్యాపారి వద్ద ఉండే ప్రత్యేక పీఓఎస్ మెషిన్‌పై ట్యాప్ చేస్తే చాలు. ఎలాంటి యూపీఐ పిన్ నమోదు చేయాల్సిన అవసరం లేకుండానే డబ్బులు కట్ అవుతాయి.
ఈ విధానంలో కొనుగోలుదారుడి ఫోన్, వ్యాపారి వద్ద ఉండే పీఓఎస్ మెషిన్ రెండూ ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పటికీ పేమెంట్స్ సక్సెస్ అవుతాయి. ఆ తర్వాత పీఓఎస్ మెషిన్ లావాదేవీ వివరాలను తనలో దాచుకుని.. దానికి నెట్‌వర్క్ కనెక్షన్ వచ్చిన వెంటనే బ్యాంక్‌కు పంపి ఆటోమేటిక్‌గా సెటిల్‌మెంట్ పూర్తి చేస్తుంది. దీనివల్ల ప్రయాణికులకు, సాధారణ వినియోగదారులకు ఇంటర్నెట్ లేదనే కారణంతో పేమెంట్స్ మధ్యలో ఆగిపోవు.
ముఖ్యంగా విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు, భూగర్భ మెట్రో స్టేషన్లలో, కొండ ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ సిగ్నల్ సమస్య ఉంటుంది. ఇలాంటి ప్రదేశాల్లో ఈ ఆఫ్‌లైన్ యూపీఐ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. ఈ ఏడాది చివరి నాటికి పీఓఎస్ మెషిన్ తయారీదారులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే ప్రక్రియను ఎన్‌పీసీఐ ప్రారంభించే అవకాశం ఉంది. త్వరలోనే ఈ సేవలు ప్రజలందరికీ అందుబాటులోకి రానున్నాయి.
Also Read : నిరుద్యోగులకు గుడ్ న్యూస్: సనత్ నగర్ ‘టిమ్స్’లో 122 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్









