IND VS NZ
IND VS NZ

ఇటీవల భారత్ – వెస్టిండీస్ మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. రెండు మ్యాచ్‌లు టీమిండియా, మరో రెండు మ్యాచ్‌లు వెస్టిండీస్ గెలుచుకోగా.. చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఇప్పుడు భారత్ మరో జట్టుతో టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. రేపటి నుంచి న్యూజిలాండ్‌తో 5 మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభం కానుంది. క్రైస్ట్‌చర్చ్‌లోని హ్యాగ్లీ ఓవల్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం టీమిండియా ఫైనల్ జట్టుపైనే అందరి ఫోకస్ పడింది. ఇంతకీ ఈ మ్యాచ్‌లో ఎవరెవరికి అవకాశం లభిస్తుందో చూసేద్దాం..

ఈ మ్యాచ్ మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక బ్యాటింగ్ ఆర్డర్ విషయానికొస్తే.. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన యువ బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీకి తొలి మ్యాచ్‌లో అవకాశం లభించే అవకాశం తక్కువగా ఉంది. భారత జట్టు యాజమాన్యం మరోసారి అభిషేక్ శర్మ, సంజు సామ్సన్‌లనే ఓపెనింగ్‌గా దించే అవకాశం కనిపిస్తోంది.

ఇక ఫాస్ట్ బౌలింగ్ విషయానికొస్తే.. జస్ప్రీత్ బుమ్రాకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు. దీంతో అతడి స్థానంలో మోస్ట్ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు అవకాశం లభించనుంది. అతడికి తోడుగా అర్ష్‌దీప్ సింగ్ ఫాస్ట్ బౌలింగ్‌లో చేయి కలపనున్నాడు. ఇక మూడో పేసర్‌ కోసం ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్‌ల మధ్య పోటీ నెలకొంది. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే.. ప్రిన్స్ యాదవ్‌కే ప్రాధాన్యత లభించే అవకాశం కనిపిస్తోంది.

నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్‌ ఆల్‌రౌండర్లుగా చెలరేగనున్నారు. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇటీవల గాయం కారణంగా అతడు వెస్టిండీస్‌తో సిరీస్‌కు దూరం అయ్యాడు. ఇప్పుడు అతడు పూర్తిగా కోలుకోవడంతో.. తుది జట్టులోకి రానున్నాడు. అతడి రాకతో కుల్దీప్ యాదవ్‌ను దూరం పెట్టే అవకాశం ఉంది. అక్షర్ పటేల్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవచ్చు.

భారత తుది జట్టు: సంజు సామ్సన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, నితీష్ కుమార్ రెడ్డి, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.

శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, మయాంక్ యాదవ్‌లు బెంచ్‌కే పరిమితం కానున్నారు.

న్యూజిలాండ్ తుది జట్టు: టిమ్ సీఫెర్ట్, ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, బెవాన్ జాకబ్స్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ.