
SIR Form : తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR)లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది.ఈ నేపథ్యంలోSIR ముసాయిదా జాబితాలో మీ పేరు ఉందా? ఒకవేళ పేరు కనిపించకపోతే ఓటు హక్కు కోల్పోయినట్టేనా? లేదా మీ పేరు మరో పోలింగ్ కేంద్రానికి మారిందా? ముందుగా EPIC నంబర్‌తో ఓటర్ లిస్ట్‌లో ఇలా చెక్ చేయాలి?
ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేరు కనిపించని అర్హులైన పౌరులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ముసాయిదా జాబితాలో పేరు లేకపోయినా, కొత్తగా ఓటు హక్కు పొందాలన్నా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని వారంటున్నారు. అయితే భారతదేశంలో నివసించే సాధారణ పౌరులు ఫారం-6, విదేశాల్లో నివసిస్తున్న భారతీయ పౌరులు ఫారం-6A ద్వారా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ముందుగా మీ పేరు నిజంగానే ముసాయిదా జాబితాలో ఉందో లేదో నిర్ధారించుకోవాలి. దీని కోసం భారత ఎన్నికల సంఘం ఓటర్ల సేవల పోర్టల్‌లోని ‘Search in Electoral Roll’ ను ఉపయోగించుకోవచ్చు. EPIC నంబర్‌తో పాటు పేరు, వయస్సు, నియోజకవర్గం వంటి వివరాలతో కూడా వెతుక్కునే సౌలభ్యం ఉంది. నియోజకవర్గాల పునర్విభజన, పోలింగ్ కేంద్రాల మార్పు లేదా ఇతర సాంకేతిక కారణాలతో పేరు మరో పోలింగ్ స్టేషన్ పరిధిలోకి మారే అవకాశం ఉంది. కనుక పూర్తిస్థాయిలో చెకింగ్ చేసుకోవడం అత్యంత అవసరం.
మీరు పూర్తి స్థాయిలో వెతికనప్పటికీ మీ పేరు ఎక్కడా కనిపించకపోతే ఆన్‌లైన్‌లో కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం ECI Voters’ Service Portalలో ఖాతాలోకి లాగిన్ అవ్వాలి. ఖాతా లేకపోతే మొబైల్ నంబర్‌తో Sign-Up చేసి కొత్త అకౌంట్ సృష్టించుకోవాలి. మొబైల్ వినియోగదారులు Voter Helpline App ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. సాధారణ ఓటర్ల కోసం ‘New registration for general electors’ కింద Form 6 ఎంచుకోవాల్సి ఉంటుంది. విదేశాల్లో నివసించే భారత పౌరులు Form 6Aను ఎంచుకుని దాన్ని నింపాలి.
అందులో రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, పేరు, తండ్రి లేదా భర్త పేరు, పుట్టిన తేదీ, ప్రస్తుత చిరునామా వంటి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అవసరమైన పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. సాధారణంగా పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, వయస్సు ధ్రువీకరణ పత్రం, చిరునామా ధ్రువీకరణ పత్రం అవసరం ఉంటుంది. వయస్సు ఆధారంగా ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పదో తరగతి సర్టిఫికెట్ వంటి పత్రాలను, పూర్తి చిరునామా కోసం ఆధార్, కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు లేదా బ్యాంక్ పాస్‌బుక్ వంటి ఆధారాలను ఉపయోగించవచ్చు. NRI దరఖాస్తుదారులు భారతీయ పాస్‌పోర్ట్ కాపీని సమర్పించాల్సి ఉంటుంది.
మీరు నింపిన వివరాలను మరోసారి పరిశీలించిన ఆ తర్వాత డిక్లరేషన్‌ను అంగీకరించి ‘Preview and Submit’ ద్వారా దరఖాస్తు పంపించాలి. సమర్పించిన అనంతరం వచ్చే Reference IDని గుర్తు పెట్టుకోవాలి. దాని ద్వారా BLO వెరిఫికేషన్, దరఖాస్తు ఆమోదం వంటి తదుపరి దశలను ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం వీలు కాకపోతే సంబంధిత BLOను సంప్రదించి ఫారం-6 తీసుకుని పూర్తి చేయాలి. పూర్తి చేసిన ఫారంతో ఆధార్, చిరునామా ధ్రువీకరణ పత్రాల ప్రతులు, ఫొటో జతచేసి అందించాలి. ప్రత్యామ్నాయంగా తహసీల్దార్ (MRO) కార్యాలయం లేదా RDO కార్యాలయంలోని ఎన్నికల విభాగంలోనూ దరఖాస్తు సమర్పించడానికి అవకాశం ఉంది.









