Kadiyam vs Konda: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయం తీవ్ర వేడెక్కింది. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు ఇప్పుడు బహిరంగ సమరంగా మారింది. కడియం శ్రీహరి లక్ష్యంగా మంత్రి కొండా సురేఖ మరోసారి తీవ్రస్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరికి దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలని, ఎమ్మెల్యేగా పనులు చేయడం చేతకాకపోతే పదవికి రాజీనామా చేసి ఇంట్లో పడుకోవాలని ఘాటుగా విమర్శించారు. కడియం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాకే జిల్లాలో వర్గపోరు, వివాదాలు మొదలయ్యాయని ఆరోపించారు.

ఆర్టీవీ (RTV)తో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి కొండా సురేఖ కడియంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “కడియం శ్రీహరికి 72 సంవత్సరాలు వచ్చినా బుద్ధి మారడం లేదు. ఆయన క్షమించరాని తప్పులు చేస్తున్నారు. మునిసిపల్ కమిషనర్ ఆఫీసులో స్వయంగా కూర్చొని, అధికారులను గత రెండు నెలలుగా ఇబ్బంది పెడుతూ రివ్యూ సమావేశాలు నిర్వహించి ఆదేశాలు ఇవ్వడం ఏంటి? కడియం తప్పు చేశారని ఆయనకు కూడా తెలుసు, కానీ ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు” అని కొండా సురేఖ ఆరోపించారు.

గత రాజకీయాలను ప్రస్తావిస్తూ కొండా సురేఖ కడియంపై మరింత విరుచుకుపడ్డారు. పూర్వపు టిడిపి హయాంలో కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావు కలిసి తమ దంపతులను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని, అయినా సరే ప్రజాబలంతో తాము గెలిచి చూపించామని గుర్తుచేశారు. జిల్లాలో కొండా దంపతులు అత్యంత బలమైన నాయకులని, తమను ఢీకొట్టే దమ్ము జిల్లాలో ఎవరికీ లేదని స్పష్టం చేశారు. కడియం ఇప్పటికే తన కూతురిని ఎంపీగా గెలిపించుకున్నారని, ఇంకా ఆయనకు ఏమి కావాలని ప్రశ్నించిన ఆమె, ప్రస్తుతం కాంగ్రెస్‌లో కడియం మాటను ఎవరూ లెక్కచేయడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ వివాదాన్ని కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు కొండా సురేఖ తెలిపారు. ఇప్పటికే కడియం శ్రీహరి వైఖరిపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేశానని, రాబోయే 14వ తేదీన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌ను వ్యక్తిగతంగా కలసి రాతపూర్వకంగా మరోసారి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. కడియం శ్రీహరిపై పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్‌లతో చర్చించి ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని కొండా సురేఖ స్పష్టం చేశారు.

Also Read : పోక్సో కేసులో బండి భగీరథ్‌కు ఊరట.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు

మరోవైపు కొండా సురేఖ ఆరోపణలపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కొండా సురేఖ ఏనాడూ జిల్లా అభివృద్ధి గురించి పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కంటే, నిరంతరం ఏదో ఒక కాంట్రవర్సీ (వివాదం) సృష్టించడం ద్వారానే వార్తల్లో, ప్రజల్లో ఉండేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని కడియం విమర్శించారు. తాను నియోజకవర్గ అభివృద్ధి కోసమే అధికారులతో సమీక్షలు నిర్వహించానని, ఈ విషయంలో తాను ఎవరికీ ప్రత్యేకంగా వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.

వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో ఇద్దరు సీనియర్ నాయకుల మధ్య నడుస్తున్న ఈ ‘పోరు’ ఇప్పుడు గాంధీ భవన్ వర్గాలతో పాటు కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. పాత కాంగ్రెస్ నాయకులు, కొత్తగా చేరిన నాయకుల మధ్య ఆధిపత్య పోరు కాస్త తీవ్రస్థాయికి చేరడంతో జిల్లాలోని ఇతర నాయకులు, కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఘాటు వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని అధిష్టానం భావిస్తోంది.

వరంగల్ కార్పొరేషన్,జిల్లా పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం, అభివృద్ధి పనుల ప్రాధాన్యతలు, నియోజకవర్గాల్లో పట్టు సాధించే క్రమంలోనే ఈ ఇద్దరి మధ్య వివాదం ముదిరినట్లు తెలుస్తోంది. గతంలో కూడా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం సాగగా, తాజాగా కమిషనర్ కార్యాలయంలో కడియం రివ్యూ నిర్వహించడం చిచ్చును మరింత రగిల్చింది. పార్టీలో చేరిన నాటి నుండి కడియం ఒంటెత్తు పోకడలు పోతున్నారని కొండా వర్గం ఆరోపిస్తుంటే, కొండా దంపతులు అనవసరంగా రాజకీయం చేస్తున్నారని కడియం వర్గం వాదిస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. 14వ తేదీన మీనాక్షి నటరాజన్‌తో కొండా సురేఖ భేటీ కానుండటం, అధిష్టానానికి ఫిర్యాదు చేయనుండటంతో హైకమాండ్ ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు పిసిసి నాయకత్వం తక్షణమే కల్పించుకుని ఈ ఇద్దరు కీలక నేతల మధ్య సయోధ్య కుదర్చకపోతే, జిల్లాలో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read : ‘ఆ ఒప్పందం బయటపెడితే రాజీనామాకు సిద్ధం’: రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.