
Telangana population: తెలంగాణ ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అధికారికంగా మొదటిసారి జనాభా లెక్కల సేకరణను చేపట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా కేంద్రం విడుదల చేసిన తాజా అంచనాల ప్రకారం.. తెలంగాణలో జనాభా, కుటుంబాల సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1.14 కోట్ల కుటుంబాలు ఉండగా, మొత్తం జనాభా 4.35 కోట్లకు చేరినట్లు లెక్కలు చెబుతున్నాయి. గతంలో 2011లో జరిగిన జనాభా లెక్కలతో పోలిస్తే.. ఈసారి కుటుంబాల సంఖ్య 31 లక్షలు, అలాగే జనాభా ఏకంగా 85 లక్షలు పెరగడం విశేషం. జనాభా సేకరణలో భాగంగా రెండో దశలో ప్రతి ఒక్కరి పూర్తి వివరాలను 2027 ఫిబ్రవరిలో నమోదు చేయనున్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు సమయాల్లో రెండు పెద్ద సర్వేలు నిర్వహించింది. కేవలం ఆరు నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను చేపట్టింది. ఆ సర్వేలో తెలంగాణ జనాభా కేవలం 2.55 కోట్లు ఉన్నట్లు మాత్రమే రికార్డయ్యింది. ఆ సమయంలో సుమారు 3 శాతం మంది సర్వేలో పాల్గొనలేదని ప్రభుత్వం చెప్పింది. ఒకవేళ ఆ 3 శాతం మందిని కూడా కలిపినా.. రాష్ట్ర జనాభా గరిష్టంగా 3.65 కోట్ల లోపే ఉంటుందని అప్పట్లో అధికారులు అంచనా వేశారు. కానీ, కేంద్రం తాజాగా విడుదల చేసిన అంచనాలను చూస్తే.. రాష్ట్ర జనాభా ఏకంగా 4.35 కోట్లు దాటేసింది. అంటే, రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వే లెక్కల కంటే ఇది చాలా ఎక్కువ.
గతంలో అంటే 2010-11లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అధికారికంగా జనాభా లెక్కలు సేకరించారు. ఆ లెక్కల ప్రకారం తెలంగాణ ప్రాంతంలో జనాభా 3.50 కోట్లుగా, కుటుంబాల సంఖ్య 83.05 లక్షలుగా ఉండేవి. గడిచిన కాలంలో జనాభా పెరగడంతో పాటు ఉమ్మడి కుటుంబాలు విడిపోయి విడివిడిగా ఉంటుండటంతో కుటుంబాల సంఖ్యలో కూడా భారీ మార్పు వచ్చింది. ఇప్పుడు జనాభా మరో 85 లక్షలు పెరిగి 4.35 కోట్లకు చేరగా.. కుటుంబాలు 31 లక్షలు పెరిగి 1.14 కోట్లకు చేరాయి.
ఈ తాజా లెక్కల్లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం గ్రేటర్ హైదరాబాద్ జనాభా. కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఏకంగా 36 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడి జనాభా ఎంతలా పెరిగిపోయిందంటే.. మన దేశంలోని గోవా రాష్ట్రం మొత్తం జనాభా కంటే గ్రేటర్ హైదరాబాద్ జనాభానే చాలా ఎక్కువగా ఉంది. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే ఒక వింత మార్పు కనిపించింది. 2011లో రంగారెడ్డి జిల్లాలో 12.35 లక్షల కుటుంబాలు ఉండగా.. తాజా అంచనాల్లో ఆ సంఖ్య 5.65 లక్షలకు పడిపోయింది. ఈ జిల్లాకు చెందిన చాలా కుటుంబాలు ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
Also Read : మహిళల భద్రతకు ‘షీ నేత్ర’ రక్షణ కవచం
ఉమ్మడి జిల్లాల వారీగా కుటుంబాల సంఖ్య
- హైదరాబాద్ : 21.00 లక్షల నుంచి 36.00 లక్షలకు పెరిగింది.
- నల్గొండ: 8.75 లక్షల నుంచి 10.43 లక్షలకు పెరిగింది.
- కరీంనగర్: 9.76 లక్షల నుంచి 10.02 లక్షలకు పెరిగింది.
- వరంగల్: 8.86 లక్షల నుంచి 9.69 లక్షలకు పెరిగింది.
- మహబూబ్నగర్: 8.69 లక్షల నుంచి 9.12 లక్షలకు పెరిగింది.
- మెదక్: 6.68 లక్షల నుంచి 8.43 లక్షలకు పెరిగింది.
- ఆదిలాబాద్: 6.49 లక్షల నుంచి 8.00 లక్షలకు పెరిగింది.
- ఖమ్మం: 6.99 లక్షల నుంచి 7.75 లక్షలకు పెరిగింది.
- నిజామాబాద్: 5.93 లక్షల నుంచి 7.11 లక్షలకు పెరిగింది.
- రంగారెడ్డి: 12.35 లక్షల నుంచి 5.65 లక్షలకు తగ్గింది.
రాబోయే 2027 ఫిబ్రవరి నాటికి పూర్తి స్థాయి వివరాల నమోదు ప్రక్రియ ముగిశాక, తెలంగాణ జనాభాకు సంబంధించిన మరిన్ని స్పష్టమైన వివరాలు అధికారికంగా బయటకు రానున్నాయి.
Also Read : ఫ్రీ ఫైర్ ఆన్ లైన్ గేమ్ వేదికగా బాలికలకు వల.. మాయగాళ్ల సరికొత్త పంథా









