Crime News : నల్గొండ జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అత్యంత దారుణంగా హత్యకు గురైన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. సాగర్‌ రోడ్డులోని తెలంగాణ కాలనీలో జరిగిన ఈ ఘోరకలి ఉద్దేశపూర్వకంగా, ఒక పక్కా వ్యూహం ప్రకారమే జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ దారుణ హత్యల మిస్టరీని ఛేదించడం ప్రస్తుతం పోలీసు యంత్రాంగానికి ఒక పెద్ద సవాలుగా మారింది.

మృతులను మహ్మద్‌ సుల్తాన్‌ (45), ఆయన భార్య హసీనా (38), కుమారుడు ముజామిల్‌ (19), కుమార్తె అఫోరా అలియాస్ అప్సర్ (14)లుగా గుర్తించారు. జూన్ 19వ తేదీ శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి జూన్ 20వ తేదీ శనివారం తెల్లవారుజామున 4 గంటల మధ్య కాలంలో ఈ ఘాతుకం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ రాత్రి ఆ ఇంట్లో అసలేం జరిగిందనే అంశంపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

హత్యలు జరిగిన శుక్రవారం రాత్రి సుల్తాన్‌ తన బ్యాగుల వ్యాపారం ముగించుకుని రాత్రికి ఇంటికి రాగా, ఏసీ మెకానిక్‌ షాప్‌లో పనిచేసే ముజామిల్‌ రాత్రి 10 గంటల వరకు విధుల్లో ఉండి ఇంటికి చేరుకున్నాడు.

స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న హసీనా, కూతురు అఫోరా కూడా సాయంత్రానికే ఇంటికి వచ్చారు. అయితే అర్ధరాత్రి సమయంలో ఆ ఇంట నుంచి పెద్దఎత్తున ‘బచావ్‌.. బచావ్‌’ అంటూ హాహాకారాలు, ఆర్తనాదాలు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. అర్ధరాత్రి ఆటోలో వచ్చిన ఇద్దరు లేదా ముగ్గురు దుండగులు ఇంట్లోకి చొరబడి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు.

పోస్టుమార్టం నివేదికలో హంతకుల క్రూరత్వం స్పష్టంగా వెల్లడైంది. మృతుల ఛాతి పైభాగం, మెడ, తలలను మాత్రమే టార్గెట్ చేస్తూ పదునైన కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. తండ్రి సుల్తాన్‌కు 6 కత్తిపోట్లు, కుమారుడు ముజామ్మిల్‌కు 12, హసీనాకు 8, కుమార్తె అప్సర్‌ శరీరంపై 9 కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు తేల్చారు. నలుగురిని అంతమొందించిన అనంతరం మృతదేహాలు త్వరగా బయటపడకుండా ఉండేందుకు వాటిపై చద్దర్లు కప్పి, ఎవరూ లోపలికి రాకుండా ప్రధాన గేటుకు తాళం వేసి హంతకులు పారిపోయారు.

పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా ఇంట్లోని బీరువా తెరిచి ఉంది, సామాన్లు చిందర వందరగా పడి ఉన్నాయి. రెండు నెలల క్రితం కూడా ఈ ఇంట్లో ఒకసారి చోరీ జరగ్గా వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇప్పుడు నలుగురిని హతమార్చిన అనంతరం ఇంట్లో ఉన్న నగదు, నగలను దోచుకెళ్లారా? లేక కేవలం దోపిడీలా చిత్రీకరించడానికే బీరువాను తెరిచారా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.

హత్యకు గురైన హసీనాకు నకిరేకల్‌కు చెందిన ఆమె తల్లిదండ్రులు వారసత్వంగా ఇచ్చిన స్థలంలో, ఆమె కష్టార్జితంతో రెండేళ్ల క్రితమే ఈ ఇల్లు నిర్మించుకున్నారు. నల్గొండ పాతబస్తీకి చెందిన సుల్తాన్‌ మొదటి భార్య చనిపోవడంతో హసీనాను వివాహం చేసుకున్నాడు. మరణించిన పిల్లలిద్దరూ సుల్తాన్ మొదటి భార్య సంతానం. సుల్తాన్‌కు ఇది రెండో వివాహం కాగా, హసీనాకు గతంలో మూడు వివాహాలు అయినట్లు పోలీసుల విచారణలో తేలింది.

ఈ నేపథ్యంలో ఆస్తుల వ్యవహారాలు, కుటుంబ నేపథ్యాలు ఈ హత్యలకు కారణమై ఉండవచ్చనే బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల మొదటి వారంలో ఈ నలుగురు మిర్యాలగూడ, భువనగిరిలో జరిగిన బంధువుల వివాహ వేడుకలకు వెళ్లి వచ్చారు. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల అనంతరం ఈ కుటుంబంలో తీవ్రమైన గొడవలు, పంచాయితీలు పెరిగినట్లు స్థానికులు పోలీసులకు కీలక సమాచారం అందించారు.

ఈ కేసు తీవ్రత దృష్ట్యా ఐజీ షెహనాజ్‌ ఖాసీం ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌, ఏఎస్పీ రమేష్‌, డీఎస్పీ శివరాంరెడ్డి ఆధ్వర్యంలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌లతో కలిపి మొత్తం ఏడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నిందితులను బుధవారం సాయంత్రంలోగా పట్టుకోవాలని ఐజీ ఉన్నతాధికారులను ఆదేశించారు.

పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన ఈ హత్యల్లో ఎలాంటి ఆధారాలు దొరక్కుపోవడంతో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆశ్రయించారు. ఇంటి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను, అనుమానాస్పద ఆటో కదలికలను పరిశీలిస్తున్నారు. అలాగే మృతుల కాల్ డేటా రికార్డులను (CDR) సేకరించి విశ్లేషిస్తున్నారు. మృతుల కుటుంబీకులు, బంధువుల కోణంలో పాత కక్షల గురించిన వివరాలను సేకరిస్తున్నారు.

ప్రస్తుతం పోలీసులు ఈ కేసులో దాదాపు 10 నుండి 15 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మంగళవారం రాత్రి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించడంతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆస్తుల గొడవలా, కుటుంబ కలహాలా లేక పాత కక్షలా అనే విషయాలు నిందితులు దొరికితేనే స్పష్టమయ్యే అవకాశం ఉంది.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.