Hydra Chief Ranganath: హైదరాబాద్‌లో సీనియర్ ఐపీఎస్ అధికారి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఘటన కలకలం రేపుతోంది. నిబంధనలను అతిక్రమించిన కొన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఏకంగా ఉన్నతాధికారుల సంతకాలనే నకిలీగా సృష్టించి అడ్డదారుల్లో అనుమతులు పొందేందుకు ప్రయత్నించాయి. హైడ్రా చీఫ్ ఏవీ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్ ఎన్‌ఓసీ సర్టిఫికెట్లను కూడా తయారు చేశాయి.

Also Read : కల్తీ మసాలా మాఫియా గుట్టురట్టు.. 25.3 టన్నుల కల్తీ మసాలా స్వాధీనం

అయితే కళాశాలల గుర్తింపు, నిర్వహణ కోసం ఇంటర్మీడియట్ బోర్డుకు అగ్నిమాపక శాఖ అనుమతి పత్రాలు సమర్పించాలి. ఈ అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు సరిగా లేకపోవడంతో తెల్లాపూర్, చిక్కడపల్లి, ఎస్సార్ నగర్, మెహదీపట్నం, బర్కత్‌పుర వంటి ప్రధాన ప్రాంతాల్లోని ఎనిమిది ప్రైవేట్ కాలేజీలు సక్రమమైన మార్గంలో ఎన్‌ఓసీలు పొందలేకపోయాయి. దీంతో ఈ కాలేజీల యాజమాన్యాలు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి.. నకిలీ ఫైర్ ఎన్‌ఓసీ పత్రాలను తయారు చేయించాయి. ఆపై ఎలాంటి అనుమానం రాకుండా ఆ నకిలీ పత్రాలను ఇంటర్ బోర్డుకు సమర్పించాయి.

ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు చేపట్టిన పరిశీలనలు, పత్రాల తనిఖీల్లో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. సమర్పించిన ఫైర్ ఎన్‌ఓసీలు నకిలీవని, వాటిపై ఉన్నది ఫోర్జరీ సంతకమని అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించి ఫోర్జరీకి పాల్పడిన ఈ ఎనిమిది ప్రైవేట్ కాలేజీల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. దీంతో లేక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నకిలీ పత్రాల తయారీ కమిషనర్ సంతకం ఫోర్జరీ చేయడం వంటి తీవ్రమైన నేరాలపై పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని పలు కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఫోర్జరీ రాకెట్ వెనుక ఎవరున్నారు? నకిలీ ఎన్‌ఓసీలు తయారు చేసి ఇచ్చింది ఎవరు? కాలేజీల యాజమాన్యాల పాత్ర ఎంతవరకూ ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Also Read : బీఆర్‌ఎస్‌ క్షుద్రపూజలు చేస్తోంది : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు