ప్రస్తుతం పలు ఐటీ కంపెనీలు క్రూరంగా ప్రవర్తిస్తున్నాయి. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఉద్యోగాల నుంచి తీసేస్తుంది. అయితే ఇటీవల ఓ టెకీకి ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా జాబ్ నుంచి తొలగించిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ టెక్ మహీంద్రాలో భావన అనే యువతి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తోంది. అయితే తన కుమార్తెకు ఆరోగ్యం బాలేకపోవడంతో.. కూతురిని చూసుకోవడానికి మూడు రోజులు సిక్ లీవ్ తీసుకుంది. అయితే ముందుగానే కంపెనీకి సమాచారం అందించి లీవ్ తీసుకున్నట్లు ఆమె తెలిపారు. కానీ సిక్ లీవ్ తీసుకుందనే కారణంతో.. ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా.. సంస్థ ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. తీవ్ర మానసిక వేదనకు గురైన బాధితురాలు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కుత్బుల్లాపూర్ పరిధిలోని దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. స్టేషన్‌లో ఈ ఘటనపై కేసు నమోదైంది.

కంపెనీలో ఉద్యోగుల పట్ల యాజమాన్యం ప్రవర్తిస్తున్న తీరుపై భావన సంచలన ఆరోపణలు చేశారు. ఆఫీసులో కనీసం వాష్‌రూమ్‌కి వెళ్లాలన్నా ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలని రూల్స్ పెట్టి వేధించేవారని పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నా, మెడికల్ లీవ్స్‌ను యాడ్ చేయకుంండా.. తప్పనిసరిగా విధులకు హాజరుకావాలంటూ నిరంతరం ఈ-మెయిల్స్ పంపి ఒత్తిడికి గురిచేశారని తెలిపారు. మానసిక ప్రశాంతత లేకుండా చేసి.. బలవంతంగా పనిచేయించుకునే వారని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.