kavitha

Kavitha : మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. తన పార్టీ పేరు రిజిస్ట్రేషన్ విషయంలో ఆమె వేసిన పిటిషన్‌ను కోర్టు సున్నితంగా తిరస్కరించడమే కాకుండా ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

కవిత తన కొత్త పార్టీకి తెలంగాణ రక్షణ సమితి అనే పేరు పెట్టాలని అనుకున్నారు. అయితే, ఈ పేరు పాత టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి ) పేరును పోలి ఉందంటూ కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. జూన్ 23న కవితకు ఈ మేరకు ఈసీ లేఖ కూడా పంపింది. మీకు వేరే ఏదైనా ప్రత్యామ్నాయ పేరు చూసుకోండి తప్ప.. పాత టీఆర్ఎస్ గుర్తుకొచ్చేలా, దానికి దగ్గరగా ఉండేలా ఎలాంటి పేరు పెట్టడానికి వీల్లేదు అంటూ లేఖలో ఈసీ స్పష్టం చేసింది. అయితే ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, తన పార్టీ పేరును ఖరారు చేయాలంటూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

అయితే హైకోర్టులో కవితకు ఊరట దక్కకపోగా.. క్లారిటీతో కూడిన షాక్ తగిలింది. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఈసీ నిర్ణయాన్ని సమర్థించినట్లుగా మాట్లాడింది. తెలంగాణ రక్షణ సేన అనే పేరు వినడానికి పాత టీఆర్ఎస్ లాగే అర్థం వచ్చేలా ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఈసీ ఇచ్చిన నోటీసుకు కోర్టుకు రావడం కాదని, ముందు ఆ ఎన్నికల సంఘానికే సరైన రీతిలో సమాధానం చెప్పుకోవాలని కవితకు కోర్టు సూచించింది. అక్కడి ప్రక్రియ ముగిశాకే కోర్టుకు రావాలని స్పష్టం చేసింది.

ఇప్పుడు ఈ పిటిషన్‌ను తాము విచారణకు స్వీకరిస్తే.. అది ఎన్నికల సంఘం విధుల్లో తలదూర్చినట్లు అవుతుందని, తాము అలా చేయలేమని హైకోర్టు తేల్చి చెప్పేసింది. కోర్టు వ్యాఖ్యలను బట్టి చూస్తే తెలంగాణ రక్షణ సమితి లేదా టీఆర్ఎస్ షార్ట్ ఫామ్ వచ్చేలా ఏ పేరు పెట్టినా ఈసీ ఒప్పుకునేలా లేదు. కోర్టు కూడా ఈసీ వైపే మొగ్గు చూపింది కాబట్టి, కవిత తన పార్టీ కోసం సరికొత్త పేరును వెతుక్కోవాల్సిన పరిస్థితి రావచ్చు.

పార్టీ పేరు ఫిక్స్ అయితే తప్ప క్యాడర్‌ను లైన్లో పెట్టడం, ప్రచారం చేసుకోవడం కుదరదు. ఇప్పుడు మళ్లీ ఈసీకి సమాధానం ఇవ్వడం, వారు స్పందించడం.. ఒకవేళ కుదరకపోతే కొత్త పేరు చూసుకోవడం అనే ప్రాసెస్ వల్ల ఆమెకు రాజకీయంగా చాలా సమయం వృథా అయ్యేలా కనిపిస్తోంది.

 

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.