
Konda Surekha : మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రెస్ మీట్ పెట్టి మరి సురేఖపై ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో సురేఖపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం కూడా సిద్ధమైనట్లు సమాచారం. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేయడంతో కాంగ్రెస్‌లో తీవ్ర స్థాయి చర్చకు దారి తీశాయి. ఈ విషయంలో కొండా సురేఖను టార్గెట్ చేసిన పార్టీ అధిష్టానం క్రమశిక్షణా చర్యల్లో భాగంగా నోటీసులివ్వడంతో పరిమితం కాకుండా చర్యలకు కూడా ఉపక్రమించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయ.
ముఖ్యమంత్రిపై సురేఖ కూతురు తీవ్ర స్థాయిలో చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. బుధవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న సీఎం గురువారం లండన్ పర్యటనకు బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. కాగా ఢిల్లీలో సమావేశం ముగిసిన వెంటనే కొందరు ముఖ్యనాయకులతో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయమై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టీ విక్రమార్క, మరికొందరు మంత్రులతోనూ మాట్లాడి ముఖ్యమంత్రి ఈ విషయంలో కొండా సురేఖపై చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలిసింది. పీసీసీ క్రమశిక్షణా కమిటీ బుధవారం మంత్రి కొండా సురేఖకు నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే దానిక ప్రతీగా కుమార్తె చేసిన ఆరోపణలకు తానెలా బాధ్యురాలినని గురువారం సురేఖ సమాధానం ఇవ్వడం గమనార్హం. ఇదిలా ఉండగానే పుండు మీద కారం చల్లినట్లు సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై గురువారం కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. ఓ వ్యాపారిని బెదిరించి దాడిచేసినట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా సుమంత్ పై గతంలో ఓ వివాదానికి సంబంధించి పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నించినపుడు కూడా కొండా సురేఖ కూతురు సుస్మిత అడ్డుకోవడంతో పాటు సీఎం పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అయితే అపుడు కోతమంది ఆ పార్టీ పెద్దల జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దు మణిగింది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు.
బర్తరఫ్ చేస్తారా..బహిష్కరిస్తారా?
కాగా, ప్రస్తుతం కొండా సురేఖపై అధిష్టానంతో పాటు పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు సీరియస్ గా ఉన్నారు. ఆమెపై చర్యలు తీసుకోవడానిక ముందే ఆమె రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేయడం గమనార్హం. దీనితో పార్టీ అధిష్టానం కూడా ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది.ఒకవేళ సురేఖను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేస్తే జరగబోయే పరిణామాలపై అధిష్టానం అంచనా వేస్తోంది. ఈ క్రమంలో మంత్రి వర్గం నుంచి సురేఖను బర్తరఫ్ చేసి ఊరుకుంటారా లేక పార్టీ నుంచి కూడా బహిష్కరిస్తారా అనేది చర్చనీయంశంగా మారింది. కాగా, ప్రస్తుతం కొండా సురేఖపై చర్యలకు పార్టీ సిద్ధమవుతుండగా ఆమె తదిపరి అడుగులు ఎటువైపు అనే చర్చ సాగుతోంది. ఆమె ఒకవేళ పార్టీ నుంచి బయటకు వస్తే ఏ పార్టీలో చేరుతుందనే చర్చ సాగుతోంది. ఆమె బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. గతంలో ఒకసారి బీఆర్ఎస్ లో చేరిన కొండా సురేఖ ఆ తర్వాత కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన సందర్భం ఉంది. దీంతో ఆమెను బీఆర్ఎస్ చేర్చుకునే అవకాశం లేదు. అదే సమయంలో సురేఖను బీజేపీ కూడా తీసుకునే అవకాశాలు లేవన్న చర్చ సాగుతోంది. దీంతో సురేఖ తదిపరి అడగులు ఎటువైపు అనేది చర్చనీయంశంగా మారింది.









