Raidurgam Land : హైదరాబాద్ లో భూముల ధరలకు రెక్కలొస్తున్నాయి. నగరంలో ఇప్పటికే కోట్లు పలుకుతున్న ధరలు ఇపుడు మరింత ఊహించని రీతికి చేరుకున్నాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్ లో భూమి కొనడం అంటే గగనంగా మారింది. ఐటీ కారిడార్‌ రాయదుర్గంలోని భూమి ధర మరోసారి ఆల్‌టైమ్‌ రికార్డు నమోదు చేసింది. ఇటీవల రాయదుర్గంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ(టీజీఐఐసీ) వేలం వేసిన ఎకరా భూమి రూ.264 కోట్లు పలికిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అదే ప్రాంతంలో మరోసారి వేలం వేయగా గత రికార్డును బద్దలు కొడుతూ ధర పలకడం విశేషం. శుక్రవారం పాన్ మక్తాలోని భూమికి టీజీఐఐసీ వేలం నిర్వహించగా.. ఎకరా భూమి ఏకంగా రూ.269 కోట్లు పలికింది. 5.38 ఎకరాల భూమిని వంశీరాం బిల్డర్స్ సంస్థ రికార్డు ధర చెల్లించి భూమిని కైవసం చేసుకుంది.

Also Read : సూర్యాపేట జిల్లాలో దారుణం..వేపచెట్టు వివాదం..ఇద్దరి దారుణహత్య

తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ(టీజీఐఐసీ) శుక్రవారం నిర్వహించిన భూముల వేలానికి పెద్ద ఎత్తున స్పందన లభించింది. స్థానిక, జాతీయ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు వేలంలో పెద్ద ఎత్తున పాల్లొనడంతో పాటు పోటాపోటీగా వేలం పాటలో పాల్గొన్నాయి. భూమిని దక్కించుకోవడానికి బ్రేగేడ్‌ సంస్థ చివరి వరకు పోటీ పడింది. కానీ, చివరికి హైదరాబాద్‌కు చెందిన వంశీరాం బిల్డర్స్‌ ఎకరాకు రూ.269 కోట్లతో వేలంలో భూమిని కైవసం చేసుకుంది. కాగా ఇది రిజర్వ్‌ కంటే 52.3 శాతం అధికం కావడం విశేషం.

రాయదుర్గంలో గత వారం నిర్వహించిన ప్లాట్‌ పీ1 వేలంలో ఎకరం రూ.264 కోట్ల ధర పలికింది… దీనివల్ల 5.25 ఎకరాలకు గాను సర్కారు ఖజానాకు రూ.1,386 కోట్ల ఆదాయం సమకూరింది. వేలం విలువలో 25 శాతాన్ని ఆ సంస్థ తొలిదశ చెల్లింపుగా ఇప్పటికే ప్రభుత్వానికి జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు. రాయదుర్గం భూములు సర్కారు ఖజానాకు బంగారు గనులుగా మారాయి. 2025, 2026లో టీజీఐఐసీ రాయదుర్గంలో 41.74 ఎకరాల భూములను వేలం వేయగా ఏకంగా రూ.8,457.47 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపార

కాగా, 2014 లో రాయదుర్గంలో 31.88 ఎకరాల భూములను వేలం వేయగా రూ.730.66 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే 2007 నుంచి 2013 వరకు 102.49 ఎకరాలను వేలం వేయగా ప్రభుత్వానికి రూ.2,143.69 కోట్ల ఆదాయం సమకూరింది. కాగా రాయదుర్గం ప్రాంతంపై పెట్టుబడిదారుల్లో బలమైన ఆసక్తి ఉందని అందువల్లే వరుసగా రెండు వేలం పాటల్లో రికార్డు స్థాయిలో భూముల ధరలు పలికిందని టీజీఐఐసీ వైస్‌ ఛైర్మన్, ఎండీ కె.శశాంక తెలిపారు.

Also Read : భద్రాచలం ఎమ్మెల్యే పీఏ వసూళ్ల దందా.. ఉద్యోగాలిప్పిస్తానని రూ.కోట్లతో పరారీ

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.